లాక్ డౌన్ … కరోనా కంటే పెద్ద వైరస్ – నిపుణులు

కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నది… మన వద్ద పాపులర్ సామెత. కరోనా, లాక్ డౌన్ లకి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. మొదటి లాక్ డౌన్ మన దేశం చాలా తెలివిగా విధించింది. సరైన సమయంలోనే లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. దానివల్ల ఉద్యోగాలు పోయాయి. కోట్ల మందికి కూలీ పోయింది. అయినా పర్లేదు. ఎందుకంటే… ఆ లాక్ డౌన్ వల్ల కరోనా ఎంత పెద్ద ప్రమాదమో ప్రజలకు స్వీయ అవగాహన పెంచుకోవడానికి కారణమైంది.

లాక్ డౌన్ సామాన్యులకు కూడా కరోనా తీవ్రతను తెలియజెప్పింది. ఇపుడు బతికున్న ఏ మనిసి కూడా దేశంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదు. దీంతో కరోనా గురించి అందరూ తెలుసుకున్నారు. కానీ ఈ లాక్ డౌన్ లో ప్రజలు ప్రభుత్వానికి సహకరించారు. ప్రభుత్వం ప్రజలకు సహకరించడం లేదు.

ఎందుకంటే 20 రోజుల్లో ప్రభుత్వం టెస్టులను పెంచకపోవడం వల్ల చాలా నష్టం జరిగింది. ఎన్నారై, మర్కజ్ ఈ రెండింటి వల్లే వ్యాపించిందని తెలిసినపుడు అది ఎక్కడ పెరిగే అవకాశం ఉందో కూడా స్పష్టంగా అర్థమైనపుడు దానిని అరికట్టడంలో మోడీ సర్కారు విఫలం కావడం వల్ల రెండో లాక్ డౌన్ వేయాల్సి వచ్చింది. కానీ దీనిని కూడా సరిగా వినియోగించుకోలేదు. ఇప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన టెస్టింగ్ కెపాసిటీ చాలా తక్కువే.

రెండో లాక్ డౌన్ అనంతరం లాక్ డౌన్ 3.0 గురించి చర్చ జరుగుతోంది. కొన్ని రాష్ట్రాలు పెడదాం అంటున్నాయి. ఇంకొన్ని పెట్టేశాయి. అయితే… నిపుణులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లాక్ డౌన్ మరింత పెంచితే కరోనా వైరస్ వల్ల కలిగిన నష్టం కంటే… లాక్ డౌన్ అతిపెద్ద వైరస్ గా మారి మనల్ని తినేస్తుందంటున్నారు.

మనదేశంలో ఇన్ఫో నారాయణమూర్తి, రఘురాం రాజన్, ఇతర దేశాల్లో కూడా కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంకా పలువురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. పేద దేశంలో కొంత కాలం లాక్ డౌన్ మంచిదే కానీ… సుధీర్ఘంగా పెంచుకుంటూ పోతే ఆకలిని ప్రభుత్వం కూడా తరిమి కొట్టడం లేదు.

పేదల సంఖ్య ప్రభుత్వ శక్తి కి మించి ఉన్న చోట అంత మందికి సాయం చేయడం ఇక్కడ కుదిరే పని కాదు అంటూ ఆయన హెచ్చరించారు. ఇన్ఫో నారాయణమూర్తి ఏమంటున్నారంటే… లాక్ డౌన్ పొడిగిస్తే దేశ వ్యాప్తంగా సుమారు 19 కోట్ల మంది అసంఘటిత.. స్వయం ఉపాధితో బతుకుతున్నారని.. లాక్ డౌన్ పొడిగిస్తే ఇలాంటి వారి జీవనాధారం ప్రమాదంలో పడుతుందన్నారు. వ్యాపారులు సైతం 15 నుంచి 20 శాతం ఆదాయాన్ని కోల్పోతారన్నారు. ఇది ఎన్నో కుటుంబాలను చిదిమేస్తుందన్నారు.

మిలియనీర్లు మునిగిపోవడం అంటే వారు ఆకలితో చావరు. మహా అయితే వారి సంపద పెరగడం ఆగిపోతుంది. కానీ మిలియన్ సంపద పెరగడం ఎపుడు ఆగుతుంది? అతని కంపెనీలు మూతపడినపుడు… మరి అపుడు ఆ ఉద్యోగులు రోడ్డున పడక తప్పదు.

అంటే లాక్ డౌన్ వల్ల ఎటుచూసినా సామాన్యుడే నష్టపోతాడు. చాలా కంపెనీలో భవిష్యత్తు మీద ఆశతో నడుపుతుంటాయి. అవి ఈ లాక్ డౌన్ దెబ్బకు మళ్లీ తెరచుకునే పరిస్థితి ఉండదు. ఈ దేశంలో 10 శాతం కంపెనీలు చిన్న ఒడిదుడుకులను కూడా తట్టుకోలేవు.

వాటి యజమానులు ఇంత సుధీర్ఘ కాలం నష్టంతో నడపలేరు అవన్నీ మూతపడక తప్పదు, మళ్లీ తెరచుకోవు కూడా అని మరో నిపుణుడు వ్యాఖ్యానించారు. అందుకే కరోనా వైరస్ ను అంతమొందించే క్రమంలో లాక్ డౌన్ వైరస్ ను తెచ్చి ప్రాణాలు తీసుకోవద్దు.

ఆర్థిక వ్యవస్థను, కరోనాను రెండింటీన కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చాణక్యం ప్రభుత్వాలు ప్రదర్శిస్తే బాగుపడతాం. లేకపోతే అడ్డంగా మునిగిపోతాం అన్నది నిపుణుల అభిప్రాయం.