అనిరుధ్‌ను ఆపగలరా?

అనిరుధ్ రవిచందర్.. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఎక్కడ చూసినా ఈ యువ సంగీత సంచలనం గురించే చర్చ. ‘జైలర్’ మూవీతో అతను ఆ స్థాయిలో జనాలను ఊపేస్తున్నాడు. 17 ఏళ్ల వయసులో ‘కొలవెరి’ పాటతో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ పాట గాలి వాటం కాదని రుజువు చేస్తూ గత పదేళ్లలో ఎన్నో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చాడు. ఇక అతడి నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే.

తాజాగా అతను ‘జైలర్’ సినిమాను తన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఎలివేట్ చేసిన తీరు చర్చనీయాంశం అయింది. నిజానికి ‘జైలర్’ అంత గొప్ప సినిమా ఏమీ కాదు. కథాకథనాలు బలహీనంగా ఉంటాయి. కేవలం రజినీ చరిష్మా, ఎలివేషన్ సీన్ల మీదే సినిమా నడిచింది. ఆ సీన్లన్నింటికీ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడమే కాక.. ‘హుకుం’ పాటతో ఒక ఊపు ఊపేశాడు అనిరుధ్. ఏమీ లేని చోట కూడా ఏదో జరిగిపోతున్న భావన కలిగించింది అతడి స్కోర్. అనిరుధ్ మ్యూజిక్‌ను తీసేసి చూస్తే ‘జైలర్’ చాలా సాధారణంగా అనిపిస్తుందనడంలో సందేహం లేదు.

‘జైలర్’ సక్సెస్‌లో మేజర్ క్రెడిట్‌ను అనిరుధ్‌కే కట్టబెడుతున్నారు అందరూ. దీంతో అతడికి డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. ఎంతైనా రెమ్యూనరేషన్ ఇచ్చి అతణ్ని తమ సినిమాలకు పని చేయించుకోవాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కానీ అతను అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. అనిరుధ్ కొత్తగా ఏం సినిమాలు ఒప్పుకుంటాడో కానీ.. ‘జైలర్’ ప్రభంజనం తర్వాత అతను ఆల్రెడీ కమిటైన సినిమాల మీదికి దృష్టి మళ్లింది. ఇంకో మూడు వారాల్లోనే అనిరుధ్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ ‘జవాన్’ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్లో అనిరుధ్ తన ముద్రను చూపించాడు. ట్రైలర్‌ను భలేగా ఎలివేట్ చేశాడు. లేటెస్ట్‌గా రిలీజైన పాట కూడా ఆకట్టుకుంటోంది.

తొలి బాలీవుడ్ మూవీ, పైగా షారుఖ్ సినిమా కావడంతో ఇందులోనూ అనిరుధ్ విశ్వరూపం చూపిస్తాడని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా వచ్చిన నెలన్నరకే విజయ్-లోకేష్ కనకరాజ్‌ల ‘లియో’ రాబోతోంది. ఇప్పటిదాకా వచ్చిన ‘లియో’ ప్రోమోల్లోనూ అనిరుధ్ స్కోర్ అదిరిపోయింది. లోకేష్, విజయ్ కాంబినేషన్ అంటే ఎలివేషన్లు మామూలుగా ఉండవు. అందులోనూ అనిరుధ్ రెచ్చిపోతాడనడంలో సందేహం లేదు. కాబట్టి మున్ముందు అనిరుధ్ మేనియా మామూలుగా ఉండదన్నమాటే.