కోర్టు కేసు.. లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు.. న‌లిగిపోతున్న మంత్రి!

బీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప‌రిస్థితి రోజురోజుకూ ఇబ్బందిక‌రంగా మారుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అఫిడ‌విట్‌ను ట్యాంప‌రింగ్ చేశార‌నే ఆరోప‌ణ‌ల‌తో పోలీసులు ఆయ‌నపై కేసు న‌మోదు చేశారు. మ‌రోవైపు హైకోర్టులో ఈ కేసుపై ఇప్ప‌టికే విచార‌ణ సాగుతోంది. తాజాగా హ‌కీంపేట్‌లోని తెలంగాణ క్రీడా పాఠ‌శాల ఓఎస్డీగా ప‌ని చేస్తూ అక్క‌డి విద్యార్థినుల‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌తో హ‌రికృష్ణ స‌స్పెండ్ అయ్యారు.

ఇదీ చాల‌ద‌న్న‌ట్లుగా ఇటీవ‌ల మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలోని ఓ అధికారి.. జాతీయ స్థాయి క్రీడాకారిణికి అస‌భ్య సందేశాలు పంపిన‌ట్లు తేలింది. ఇప్పుడివ‌న్నీ మంత్రి మెడ‌కు చుట్టుకుంటున్నాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఆ క్రీడా పాఠ‌శాల ఓఎస్డీ హ‌రికృష్ణ వ్య‌వ‌హారం మంత్రికి ఆరు నెల‌ల నుంచే తెలుస‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అందుకే బాలిక‌ల‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు రావ‌డంతో వెంట‌నే హ‌రికృష్ణ‌ను స‌స్పెండ్ చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇక సొంత కార్యాల‌యంలోని ఉద్యోగి ఒక‌రు జాతీయ క్రీడాకారిణ్ని సందేశాల రూపంలో వేధిస్తుంటే మంత్రి ఏం చేస్తున్నార‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. దీంతో త‌న చుట్టూ ప్ర‌మాదం పొంచి ఉంద‌నే విష‌యం మంత్రికి అర్థ‌మైంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అందుకే టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి త‌న‌పై కుట్ర ప‌న్నుతార‌ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తాజాగా ఆరోప‌ణ‌లు చేయ‌డమే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని రేవంత్ రెడ్డి మీద‌కు తోసేసి మంత్రి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లూ వినిపిస్తున్నాయి.