సమీక్ష: సాహో

కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్. ఇదీ బాహుబలి ప్రభాస్ పేటెంట్ డైలాగ్.

కానీ కట్ అవుట్ మాత్రమే చాలదు, కంటెంట్, క్లారిటీ కూడా కావాలి డ్యూడ్…ఇదీ సాహో చూసిన తరువాత అనిపించే మాట.

రెండేళ్ల నిరీక్షణ. కోట్లాది అభిమానుల ఎదురుచూపులు, బాహుబలి రేంజ్ ఇమేజ్, ప్రపంచ వ్యాప్తంగా విడుదల, ఇదీ విడుదలకు ముందు సాహో. వందల కోట్ల ఖర్చు, పదుల సంఖ్యలో నటీనటులు, అత్యాధునిక సాంకేతిక సహకారం ఇదీ దానికి యాడెడ్ ఇంగ్రీడియెంట్స్.

కానీ తీరా సినిమా వచ్చిన తరువాత చూస్తే…సీన్ వన్ నుంచి చివరి వరకు నీరసం తప్ప మరొటికి లేదు. తెరపై జరుగుతున్నదాన్ని ప్రేక్షకుడు అలా కళ్లు అప్పగించి చూడడం మినహా, రస స్పందన అంటూ ఏమీ వుండదు. హాలీవుడ్ స్థాయి సినిమా తీయాలన్న తపనే తప్ప, ఆ రేంజ్ కథ తయారుచేయగల సత్తా కొరవడితే, తెలుగునాట అరిగిపోయిన ఓ సాదా సీదా కథను తీసుకుని, దానికి మాఫియా మసిపూసి మారేడుకాయ చేస్తే అదే సాహో.

ఓ పెద్దాయిన. పిల్లాడిని దూరంగా వుంచి పెంచుతాడు. ఇంతలో నమ్మకద్రోహం జరగిపోయి ఆ పెద్దాయినను చంపేస్తారు. దాంతో ఆ పెద్దాయిన అనుచరుల సాయంతో ఈ కుర్రాడు రంగప్రవేశం చేసి, ఆ నమ్మక ద్రోహుల ఆట కట్టిస్తాడు. తండ్రి వారసత్వం అందిపుచ్చుకుంటాడు.

ఈ కథ తెలుగునాట రకరకాల జోనర్లలో ఇప్పటికే అనేక సార్లు చూసాం. మళ్లీ అదే కథను ‘ నీ ముక్కు ఎక్కడ వుందీ అంటే, తలకాయ చుట్టూ తిప్పి, చూపించిన చందంలో చూపించి’ దీన్నే స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ టెల్లింగ్ అంటారు అని ముక్తాయించిన సినిమానే సాహో.

మాఫియా సిండికేట్ కు అధిపతి రాయ్ (జాకీ షరాఫ్) ప్రమాదంలో మరణిస్తాడు. అతగాడి వారసుడు ఎవరు అన్న క్వశ్చను వచ్చేసరికి, ఇన్నాళ్లూ ఎవరికి తెలియకుండా దూరంగా తన కొడుకును పెంచాడన్న సమాధానం బయటకు వస్తుంది. అది అలా వుండగా ముంబాయి లో వరుసగా భారీ దొంగతనాలు జరుగుతుంటాయి. వాటి దర్యాప్తు కోసం అశోకచక్రవర్తి (ప్రభాస్) అనే అండర్ కవర్ కాప్ ను రంగంలోకి దింపుతారు. అతగాడి టీమ్ లో  వుంటుంది అమృత (శ్రద్ధ కపూర్). వీళ్లంతా కలిసి ఆ దొంగ (నీల్ నితిన్ ముఖేష్) కోసం వేట సాగిస్తుంటారు. వేట కొలిక్కి వచ్చిన టైమ్ లో ఓ ట్విస్ట్. కట్ చేస్తే ఈసారి వేట అశోకచక్రవర్తి కోసం.

ఇదిలా వుంటే రాయ్ సిండికేట్ లో ఓ లాకర్, దాంట్లో కోట్ల డబ్బు వుంటుంది. దాన్ని తెరవడానికి ఓ బ్లాక్ బాక్స్ కావాలి. అది ముంబాయిలో ఓ దగ్గర వుంటుంది. దాని కోసం అందరి ప్రయత్నాలు. చివరకు ఏం జరిగింది అన్నది మిగిలిన సినిమా అయితే, అక్కడ మళ్లీ ఓ ట్విస్ట్.

ఇదీ సాహో కథ.  నిజానికి ఇంతే కాదు, ఇంకా ఎంతో, ఎంతో వుంది. అసలు ఈ సినిమా కథను ఎక్కడ మొదలు పెట్టి, ఎలా చెప్పుకుంటూ వెళ్లి వుంటాడు దర్శకుడు అన్నది పెద్ద పజిల్ లాంటి ప్రశ్న. సినిమా చూసిన తరువాత ప్రేక్షకుడికి వచ్చే అనుమానం కూడా అదే కావచ్చు. ఎందుకంటే ‘స్క్రీన్ ఫ్లే బేస్డ్’ అనే పదం మాటున ఈ పక్కా కన్ ఫ్యూజ్డ్ కథను దాచేసారు. సినిమా ప్రారంభమైంది లగాయతు ప్రతి సీన్ ఎందుకు వస్తోందో? ఎందుకు పోతొందో? అన్న అయోమయ పరిస్థితి వెంటాడుతూనే వుంటుంది.  ఆ సీన్ల పజిల్ కు అప్పుడప్పుడు సమాధానం ఇచ్చే ప్రయత్నం దర్శకుడు చేసాడు కానీ, అవి కూడా పజిల్ మాదిగానే వుంటాయి.

ఇలాంటి కంటెంట్, క్లారిటీ లేని సీన్ల ను అత్యంత క్వాలిటీగా తీయాలని కోట్లు కుమ్మరించేసారు.  కానీ చిత్రంగా అంత ఖర్చు కూడా కనిపించదు. దర్శకుడు సుజిత్ ది విడియో గేమ్ లు ఆడుకునే పాతికేళ్ల వయస్సు. అందుకే సినిమాతో తొలి ఫైట్ దగ్గర నుంచి చాలా సీన్ల అల్లిక మీదుగా, క్లయిమాక్స్ వరకు వీడియో గేమ్ లనే ఆదర్శంగా తీసుకుని రూపొందించుకున్నాడు. ప్రారంభంలో వచ్చిన ఫైట్ కు ఈ స్కీము వాడితే బాగానే వుందనిపించింది కానీ, క్లయిమాక్స్ కూ ఈ స్కీమ్ వాడడం వల్ల, జనం ఎప్పుడు అయిపోతుందో తెలియక, స్టేజ్ తరువాత ఫేజ్ వస్తుంటూ కళ్లు అప్పగించి తెరవైపు, ఎగ్జిట్ గేటు వైపు కాస్సేపు చూడడం తప్ప చేసేదేమీ వుండదు.

సినిమా మొత్తం మీద ఫ్రభాస్ కు రాసుకున్న డైలాగులు రెండు పేజీలకు మించి వుండవు అంటే అతిశయోక్తి కాదు. రెండు పేజీల డైలాగులు, నాలుగు పాటలు, మిగిలిన సినిమా అంతా ఉరకలు, పరుగులు, కాల్పులు, కొట్టడం, కొట్టించుకోవడం. అంతే. మధ్య మధ్యలో అర్థం పర్థం లేని హీరో బిల్డప్ షాట్ లు. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ ఎంత అద్భుతంగా వుంటుంది అంటే, రెండో సగంలో హీరోయిన్ నిజంగా హీరోను ప్రేమిస్తోందో, నాటకం ఆడుతోందో? అర్థం కాక బుర్ర గోక్కోవాల్సిందే. ఎందుకంటే ఒక్కో సీన్ ఒక్కోలా వుంటుంది.

ఈ సంగతులు అన్నీ అలా వుంచి యాక్షన్ సీన్ లు చూస్తుంటే వుంటాయి నా సామిరంగా…ఏ సీన్ ఎందుకు వస్తుందో? ఎవరు ఎవరి మనుషులో? ఇలా ఇష్టం వచ్చినట్లు వుంటాయి. తోచింది తోచినట్లు తీసుకుంటూ వెళ్లిపోయి, ఎడిటింగ్ టేబుల్ మీద పడేసి మీ బాధ మీరు పడండి, నా పని నేను చేసా అని డైరక్టర్ అంటే, అచ్చంగా ఇలాంటి ప్రొడెక్ట్ నే వస్తుంది. సినిమా తొలిసగం కాస్తయినా భరించవచ్చు. కానీ మలిసగం మాత్రం కష్టమే. ఓ భవంతి మొత్తం కూలగొట్టడం, భారీ వాహనాలతో ఛేజింగ్, కాలకేయులను గుర్తుకు తెచ్చే జనాలతో ఫైట్, ఇలా రాసుకుంటూ పోతే సాహో సినిమా తప్పుల జాబితా సినిమా స్క్రిప్ట్ కన్నా పెద్దదిగా వుంటుంది.

ఈ తప్పులు అన్నింటికీ కర్త, కర్మ, క్రియ అన్నీ దర్శకుడు సుజిత్ తప్ప వేరు కాదు. అతగాడి అనుభవరాహిత్యం తప్ప వేరు కాదు. ఓ కథను ఇంత అర్థం కాకుండా చెప్పడంలో అతగాడికి ఆస్కార్ ఇచ్చేయవచ్చు.

సినిమాకు ఖర్చు భారీగా పెట్టారన్నవార్తలు వున్నాయి. కానీ సినిమా అంతటా ఆ ఖర్చు ఈక్వెల్ గా కనిపించలేదు. కొన్ని సన్నివేశాలు చూస్తే, ఈ సినిమాకు అన్ని వందల కోట్లు ఖర్చు చేసారా? అన్న అనుమానాలు కలుగుతాయి. సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం క్వాలిటీ వుంది. మాధి ఫోటోగ్రపీ కొన్ని చోట్ల వైవిధ్యంగా చూపించే ప్రయత్నం కనిపించింది. జిబ్రాన్ నేపథ్యసంగీతం బాగానే వుంది. పాటలు యాడ్ అండ్ అవుట్ మాదిరిగా వున్నాయి.

ప్రభాస్ లుక్ విషయంలో కూడా కాస్త అసంతృప్తి తప్పదు. కొన్నిసార్లు అందంగా కనిపించాడు. కొన్ని సార్లు అసంతృప్తి మిగిల్చాడు. శ్రద్ధకపూర్ ఓ పాటలో మాత్రమే ఒకె అనిపించింది. బోలెడు మంది నటులు వున్నారు కానీ, ఎవరి ప్రతిభ ప్రదర్శనకు అంత అవకాశం లేదు.

మొత్తం మీద అటు ప్రభాస్ , ఇటు దర్శకుడు సుజిత్ ఇద్దరూ ఓ గోల్డెన్ చాన్స్ ను మిస్ అయ్యారు.
సాహో : కటౌట్ ఓన్లీ.. నో కంటెంట్
రేటింగ్ : 2/5