సమీక్ష – వైల్డ్ డాగ్

2.5/5

2Hrs 25Min   |   Adventure   |   2 April 2021


Cast - Nagarjuna Akkineni, Dia Mirza, Saiyami Kher

Director - Ahishor Solomon

Producer - Niranjan Reddy, Anvesh Reddy

Banner - Matinee Entertainment

Music - S. Thaman

మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని ముందే పసిగట్టి ఆ తరహా సినిమాలు చేయాలని అనుకోవడం హీరోల వివేకం. కానీ ఆ తరహా సినిమాలు తమకు సెట్ అవుతాయా? ఆ విధంగా చేయగలమా? లేదా? అన్నది కూడా ఆలోచించుకోవాలి. హీరో నాగార్జున ప్రయోగాలకు ముందు వుంటారు. చాన్నాళ్ల క్రితమే గగనం అనే సినిమా చేసారు. అప్పటికి అది అడ్వాన్స్ స్టెప్ గా అనుకోవాలి. అందుకే ఆకట్టుకుంది. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ విప్లవం కావచ్చు, ప్రేక్షకులకు బాగా పరిచయం అయిపోతున్న ఆన్ లైన్ స్ట్రీమింగ్ యాప్స్ వల్ల కావచ్చు. వరల్డ్ సినిమా, నావెల్ సినిమా ఎక్స్ పీరియన్స్ అన్నది మన ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

ముఖ్యంగా వెబ్ సిరీస్ లు ఎక్కువగా టెర్రరిజం, అండర్ వరల్డ్, మాఫీయా చుట్టూనే తిరుగుతున్నాయి. వీటినే ఆధారం చేసుకుని, అదే స్టయిల్ లో సినిమాను తెరకెక్కించాలనే ప్రయత్నమే వైల్డ్ డాగ్. దీన్ని కాదు అని తోసిపుచ్చడానికి లేదు. వైల్డ్ డాగ్ లోని కొన్ని సన్నివేశాలు ఈ విషయానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. అయితే వెబ్ సిరీస్ ల స్టయిల్ లో సినిమా తీయాలి అంటే చాలా పరిమితులు అడ్డం పడతాయి. వెమ్ సిరీస్ లకు వున్న అడ్వాంటేజ్ లు కొన్ని వున్నాయి. పాత్రలకు సరిపడా ఫేస్ లను తీసుకోవడం. ఎపిసోడ్ ఎపిసోడ్ లుగా తీయడం, నాచురల్ లొకేషన్లు ఇలా చాలా వ్యవహారాలు వెబ్ సిరీస్ లకు సాధ్యపడతాయి. కానీ సినిమా దగ్గరకు వచ్చేసరికి హీరో, మిగిలిన నటులు కీలకం. లేదూ అంటే మార్కెట్ కాదు. రెండు నుంచి రెండున్నర గంటల్లో కథ మొత్తం చెప్పాలి. అక్కడ కూడా స్క్రీన్ ప్లేను ఎత్తుగడ, ఇంటర్వెల్ బ్యాంగ్, ద్వితీయార్థం, క్లయిమాక్స్ ఇలా సెట్ చేసుకోవాలి.

హీరో నాగార్జున, దర్శకుడు సోలమన్ ఈ పరిమితులను గమనించినట్లే వున్నారు. వాటిని కొంత వరకు అధిగమించే ప్రయత్నం కూడా చేసారు. కాస్టింగ్ లో నాగ్ మినహా మిగిలిన ఫేస్ లు అన్నీ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపించేవే. అలాగే లోకేషన్ల విషయంలో వీలయినంత కొత్తదనం వుండేలా చూసుకున్నారు. అక్కడి వరకు తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి. కానీ నాగ్ ఇంకా పూర్తిగా కొత్త స్టయిల్ ఆఫ్ యాక్టింగ్ కు మారే ప్రయత్నం చేసారు కానీ డైలాగ్ మాడ్యులేషన్ లో చిన్న డ్రమెటిక్ టచ్ అలాగే వుంది. అది ఓల్డ్ స్కూల్ నుంచి వచ్చిన అలవాటు కావచ్చు. దీనికి తోడు సంభాషణలు కూడా అలాగే వున్నాయి.

సినిమా ఎత్తుగడ ఆసక్తికరంగానే వుంటుంది. కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తరువాత ఎన్ఐఎ లాంటి ఆర్గనైజేషన్ అధికారులు మాట్లాడుకోవడం, విడియో ఫుటేజ్ లను పరిశీలించే వ్యవహారాలు మరీ అమెచ్యూర్ గా అనిపిస్తాయి. సినిమా పరిశోథనలోకి పూర్తిగ ప్రవేశించాక కొంత వరకు ఓకె అనిపించుకుంటుంది. ఈ మిక్స్ డ్ వ్యవహారం వల్ల తొలిసగం పూర్తిగా మార్కులు సంపాదించుకోదు.

మలిసగం ప్రారంభమయ్యాయ ఇదో రియల్ స్టోరీ, రియల్ ఇన్సిడెంట్ అన్న విషయాలు పక్కన పెట్టేసినట్లు అనిపిస్తుంది. వాళ్లు పక్కన పెట్టకపోయినా, ప్రేక్షకుడికి ఓ కమెండో యాక్షన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది తప్ప, ఇన్వెస్టిగేషన్ సినిమాలా అనిపించదు. అయితే ద్వితీయార్థం అడ్వాంటేజ్ ఏమిటంటే రేసీగా వుండి, చకచకా సాగిపోవడం. ఎటువంటి ఉత్కంఠ, హై వుండదు. పైగా ద్వితీయార్థంలోకి వచ్చాక, కొత్త తరహా సినిమా, లాజిక్ లు అన్నవి పక్కన పెట్టి సినిమాటిక్ లిబర్టీను ఫుల్ గా వాడేసుకున్నారు. ఇలాంటివి సహజంగానే రెగ్యులర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి కాబట్టి తొలిసగం కన్నా మలిసగం బాగుందనే టాక్ బయటకు వస్తుంది.

ఇలాంటి సినిమాలో నాగ్ తన కష్టం తాను చేసాడు. డైలాగ్ మాడ్యులేషన్ తేడా వుంది తప్ప, మిగిలినదంతా ఓకె. మిగిలిన వారు అలా అలా చేసుకుంటూ పోయారు. పాటలు, కామెడీ లాంటి పొరపాట్ల జోలికి పోకపోవడం సేవింగ్ గ్రేస్ అనుకోవాలి. సినిమాకు సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ప్రాణం పోసాయి. ఓ కమెండో యాక్షన్ సినిమా కు ఎలాంటి ఆర్ఆర్ ఇవ్వాలో అలాంటి ఆర్ఆర్ ఇచ్చాడు. ప్రొడక్షన్ వాల్యూలు, సిజి వర్క్ లు బాగున్నాయి.

టోటల్ గా ఈ తరహా సినిమాలు ఇష్టపడేవారు, వెబ్ సిరీస్ లను మరిచిపోయి చూస్తే ఓకె అనేసుకుంటారు. అలా కాకుండా ఫ్రేమ్ ఫ్రేమ్ కు వాటిని గుర్తు చేసుకుంటే మాత్రం పెదవి విరుస్తారు.

ప్లస్ పాయింట్లు
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రవుండ్ స్కోర్
సెకండాఫ్

మైనస్ పాయింట్లు
ఫస్ట్ హాఫ్

ఫినిషింగ్ టచ్: మైల్డ్ డాగ్

Rating: 2.5/5

-సూర్య