సమీక్ష…ఒరేయ్ బుజ్జిగా

ఒక్కో సినిమా చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఒక్కో సినిమా చూస్తుంటే ఎందుకు చూస్తున్నామా? అనిపిస్తుంది. కరోనా కారణంగా సినిమాల కోసం మొహం వాచిపోయి వున్న తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓటిటి మీదుగా వచ్చిన సినిమా ఒరేయ్ బుజ్జిగా. తెలుగు ప్రేక్షకులు సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తుంటే, హిట్ కోసం హీరో రాజ్ తరుణ్ కూడా అలాగే చూస్తున్నాడు. కానీ అటు ప్రేక్షకుల ఆశలు, ఇటు హీరో ఆశలు రెండూ నెరవేరలేదు.

గతంలో గుండె జారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం లాంటి డీసెంట్ లవ్ స్టోరీ లు అందించిన దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఈసారి అతి పేలవమైన కామెడీ టచ్ ఇచ్చిన లవ్ స్టోరీని అందించాడు. ఈ సినిమా చూస్తుంటే కథలో కనీసం పాతికమంది అయినా కలిసి కెలికేసారేమో అనిపిస్తుంది. ఎందుకంటే కథ అంత అడ్డగోలుగా నడస్తుంది. 1970-80 ల కాలానికి వెళ్లి, అప్పట్లో వచ్చిన ఓ నాసి రకం చిన్న కామెడీ సినిమా చూస్తునట్లు అనిపిస్తుంది.

కన్ ఫ్యూజన్ కామెడీ అనే జోనర్ మంచిదే. కానీ అలాంటి జోనర్ లో కథ రాసుకున్నపుడు, దానికి సీన్లు అల్లడంలో దర్శకుడు కన్ఫ్యూజ్ కాకూడదు. ఒరేయ్ బుజ్జిగా సినిమాలో జరిగింది ఇదే. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు అలా నడచిపోతూనే వుంటుంది. సీన్లు వస్తూ వుంటాయి. పోతూ వుంటాయి. ఒక్క సన్నివేశం కూడా ప్రేక్షకులకు మినిమమ్ టు మినిమమ్ రంజింపచేయదు సరికదా, ఫరవాలేదులే అని కూడా అనిపించదు.

అసలేం జరుగుతోందో, కళ్ళ ముందు వచ్చి పోతున్న సీన్లేమిటో, ఒక్కటి కూడా రిజిస్టర్ కాదు. ఈ సీన్ అదిరిందిగా అని అనిపించేది ఒక్కటంటే ఒక్కటి కూడా వుండదు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఈ కామెడీ సినిమా చూసి నవ్వుకోవాలంటే అటు ఇటు ఇద్దరు కూర్చుని కితకితలు పెట్టినా లాభం వుండదు. అన్నింటి కన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇదే డైరక్టర్ గతంలో రెండు సినిమాలు చేసాడా? అన్న పెద్ద ప్రశ్న కళ్ల ముందుకు వస్తుంది,.

ఇంతకీ ఒరేయ్ బుజ్జిగా కథలో పాయింట్ ఏమిటంటే, ఒకే ఊరికి చెందిన హీరో (రాజ్ తరుణ్), హీరోయిన్ (మాళవిక నాయర్) ఒకేసారి ఇంట్లో జంప్ జిలానీ అంటారు. దాంతో ఆ ఇద్దరూ కలిసి లేచిపోయారని డిసైడ్ అయిపోతారు జనం. హీరో తల్లి పెద్ద అధికారి కావడంతో, ఆమెతో హీరో తండ్రికి పనులు వుండడంతో, హీరో ఎలాగో అలా హీరోయిన్ వెదికి వాళ్ల కుటుంబానికి అప్పగించేసి చేతులు దులుపుకుంటాడు. కానీ అప్పటికే జరిగే వేరే తంతు ఏమిటంటే, హీరొయిన్ ఫలానా అని తెలియకుండానే ఆమెతో ప్రేమలో పడిపోతాడు హీరో. తీరా అప్పగించాక చేసిన తప్పు తెలిసివస్తుంది. దాంతో మళ్లీ ఆమెతో దాగుడుమూతలు ఆడడం మొదలెడతాడు. చివరకు ఏమయింది అన్నది తెలుసుకోవడం పెద్ద పజిల్ ఏమీ కాదు.

నిజానికి సినిమాలో పాయింట్ ఫరవాలేదు అనే స్టేజ్ లోనే వుంటుంది. దాని చుట్టూ సరైన ఫన్ సీన్లు అల్లుకుని వుంటే అది వేరే సంగతి. కానీ దర్శకుడు ఒక్కటంటే ఒక్క సరైన సీన్ అల్లుకోలేకపోయాడు. సరైన డైలాగు రాసుకోలేకపోయాడు. కుర్రాళ్ల మధ్య నడిచే కథలో ఒక్క డైలాగు అన్నా కాస్త చమక్కుతో, కాంటెంపరీరీ గా వుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది సినిమా అంతా చూసాక. ఆసుపత్రిలో దాదాప పది నిమషాలు నడిచే సీన్ అయితే ప్రేక్షకుడికి నరకం చూపించేస్తుంది.

వేటగాడు మెత్తనయితే లేడి సింగిల్ లెగ్ డ్యాన్స్ చేస్తుంది. డైరక్టర్ కు సాధ్యం కాకపోతే, యాక్టర్లు ఎవరికి తోచించి వారు చేసుకుంటూ వెళ్లిపోతారు. ఈ సినిమాలో అదే జరిగింది. సీన్లో అంతా నటించేస్తూ వుంటారు. కనెక్టివిటీ వుండదు. సీన్ పండదు. దాంతో ప్రేక్షకుడు సంతలో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూస్తూ, సినిమా చూడడం మినహా చేసేది వుండదు. గమ్మత్తేమిటంటే సీన్ మాదిరి సీన్ నడుస్తూ వుంటుంది. దానికి పొరపాటున అంగుళం కూడా సింక్ కాకుండా నేపథ్య సంగీతం దాని మానాన అది వాయించేసుకుంటూ వెళ్లిపోతుంది.

ఇలాంటి సినిమా గురించి ఇలా ఎంత రాసుకుంటూ వెళ్లినా నెగిటివ్ పాయింట్స్ మరిన్ని కుమ్మరించడం మినహా జరిగేది ఏమీ వుండదు. యాక్టర్లు ఎవరికి వారు నటించేసిన తరువాత వీళ్లు బాగా చేసారు, లేదా బాగా చేయలేదు అని కూడా చెప్పాలనే థాట్ రాదు. పైగా సగానికి పైగా నటులు అప్పుడప్పుడో, ఎప్పుడో ఒక సారి తెరపై కనిపించేవి. టెక్నికల్ గా కూడా సినిమా అంతంత మాత్రమే.

సినిమా మొత్తం చూసిన తరువాత అనిపించేది ఒక్కటే. దర్శకుడికి చేతనైతే అన్ని విభాగాలు కంట్రోల్ లో వుంటాయి. కాస్త కాకపోతే కాస్తయినా సినిమా అనే పదార్థం కాస్త టేస్టీగా రెడీ అవుతుంది. అలా కాకపోతే అచ్చం ఒరేయ్ బుజ్జిగా మాదిరిగా వుంటుంది

ఫినిషింగ్ టచ్..ఒరేయ్ బుజ్జిగా…పారిపో

రేటింగ్ – 2.5/5