ఓటిటి సినిమాల్తో ఇదో తలనొప్పి

బాక్సాఫీస్‍ కలక్షన్లను బట్టి ఒక సినిమా హిట్టా, ఫట్టా అనేది ఇట్టే చెప్పవచ్చు. చిన్న సినిమా అయితే ప్రేక్షకులు రోజు రోజుకీ పెరుగుతున్నారా లేదా అన్న దానిని బట్టి సక్సెస్‍ అయిందా లేదా అనేది అర్థం చేసుకుంటారు. కానీ ఓటిటిలో విడుదల చేసిన సినిమా హిట్టా, ఫట్టా ఎలా తెలుస్తుంది. ఎన్ని వ్యూస్‍ వచ్చాయనేది ఓటిటి కంపెనీలు బయట పెట్టవు. అవన్నీ చెబితే తదుపరి సినిమా రైట్స్ అమ్మేటపుడు నిర్మాత రేటు ఎక్కువ చెబుతారని వాళ్ల భయం. అలా అని ఎక్కువ మంది చూస్తే ఆ సినిమా బాగుంది అనుకోవడానికి లేదు.

ఒక్కోసారి చూడ్డానికి మరే సినిమా లేక కూడా జనం చూసి వుండొచ్చు. మరి ఓటిటిలో రిలీజ్‍ అయిన సినిమా హిట్టయిందని ఎట్టా తెలిసేది? సదరు సినిమాలకు వెబ్‍సైట్లు ఇచ్చే రేటింగులు, వాటికి సోషల్‍ మీడియాలో వచ్చే పాజిటివ్‍ ఫీడ్‍బ్యాక్‍ బట్టి నిజంగా బాగుందా, లేదా బేరీజు వేసుకుంటున్నారు. ఓటిటిలో రిలీజ్‍ అయిన సినిమాలు తీసిన దర్శకులకు, హీరోలకు మాత్రం ఈ పరిస్థితి చిత్రంగా వుంది. తమ సినిమా హిట్టని చెప్పుకుని మరో అవకాశం అడగడానికి, లేదా కాస్త రేటు పెంచమని చెప్పడానికి కూడా ఈ పద్ధతి ఇబ్బందికరంగా పరిణమించింది. సీత కష్టాలు సీతవీ… పీత కష్టాలు పీతవీ అంటే ఇదేనేమో.