దర్శకుడిది కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా?

venky-atluri

ఈ రోజుల్లో ఎంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమా అయినా రెండో వీకెండ్‌ను మించి బాక్సాఫీస్ దగ్గర నిలబడడం కష్టమే. తొలి వీకెండ్లో మాగ్జిమం వసూళ్లు రాబట్టి.. ఆ తర్వాత ఓ మోస్తరు కలెక్షన్లతో సాగుతుంటాయి కొత్త సినిమాలు. శత దినోత్సవాలు, అర్ధ శతదినోత్సవాలు ఎప్పుడో చరిత్రలో కలిసిపోగా.. కొన్ని సెంటర్లలో అయినా ఓ 25 రోజులు ఆడడం కష్టమైపోతోంది. ఐతే ఈ వారాంతంలో విడుదల కానున్న ‘సార్’ సినిమా తెలుగులో నాలుగైదు వారాలు నిలకడగా వసూళ్లు రాబడుతుందని.. తమిళంలో ఈ చిత్రం ఎనిమిది వారాలు ఆడుతుందని దాని దర్శకుడు వెంకీ అట్లూరి ధీమా వ్యక్తం చేయడం విశేషం. ముందు నటుడిగా పరిచయం అయి.. ఆ తర్వాత ‘తొలి ప్రేమ’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా మారిన వెంకీ.. తొలి చిత్రం తర్వాత తనపై పెరిగిన అంచనాలను అందుకోలేకపోయాడు. అతడి మలి చిత్రాలు మిస్టర్ మజ్ను, రంగ్ దె సరిగా ఆడలేదు.

వెంకీ నాలుగో చిత్రం ‘సార్’కు కూడా విడుదల ముంగిట మరీ బజ్ ఏమీ లేదు. విడుదల దగ్గర పడ్డాక ప్రమోషన్లు బాగానే ఉన్నాయి కానీ.. మధ్యలో ఈ చిత్రాన్ని పట్టించుకోకుండా వదిలేయడం మైనస్ అయింది. ఈ సినిమా ట్రైలర్ ఓ మోస్తరుగా అనిపించిందంతే. కానీ సినిమా మీద వెంకీ మాత్రం చాలా ధీమాగానే ఉన్నట్లున్నాడు. ‘సార్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అతను మాట్లాడుతూ.. ‘‘నా తొలి సినిమా ‘తొలి ప్రేమ’ తర్వాత మళ్లీ ఇప్పుడు ధీమాగా చెబుతున్నా. ‘సార్’ సినిమా కేవలం ఫిబ్రవరి 17, 18, 19 తేదీల వరకు మాత్రమే కాదు.. నాలుగైదు వీకెండ్లు బాగా ఆడుతుంది.

తొలి వీకెండ్లో మాదిరే ఆ తర్వాత కూడా ఆడుతుంది. తమిళంలో అయితే ఈ సినిమా 8 వారాలు ఆడుతుంది. రాసిపెట్టుకోండి’’ అని చెప్పాడు. ఐతే సినిమాకు హైప్ పెంచడానికి వెంకీ ఈ మాట చెప్పాడా.. లేక నిజంగానే సినిమాలో అంత విషయం ఉందా అన్నది ఇంకొక్క రోజు వ్యవధిలో తేలిపోతుంది.