చిరు ఫ్యామిలీ సినిమాకు ఈ పరిస్థితా..

Sridevi-Shoban-Babu

సంక్రాంతి సందడి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ డల్లుగా నడుస్తోంది. ప్రతి వారం సిినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ ‘రైటర్ పద్మభూషణ్’ మినహాయిస్తే ఓ మోస్తరుగా అయినా థియేటర్లను కళకళళాడించిన సినిమా లేకపోయింది. ఐతే మహాశివరాత్రి వీకెండ్లో కొంచెం సందడి ఉంటుందని ఆశిస్తున్నారు. ధనుష్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం ‘సార్’తో పాటు కిరణ్ అబ్బవరంతో గీతా ఆర్ట్స్ వాళ్లు తీసిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ థియేటర్లలో మళ్లీ సందడి తీసుకొస్తాయని ఆశిస్తున్నారు. ఐతే ప్రేక్షకుల దృష్టంతా ఈ రెండు చిత్రాల మీదే ఉండగా.. వీటితో పాటు బరిలో ఉన్న ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమా కనీస స్థాయిలో కూడా సౌండ్ చేయలేకపోతోంది. టాలెంటెడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో తమిళ అమ్మాయి గౌరి కథానాయికగా నటించింది. ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా.. అనివార్య కారణాలతో చాలా ఆలస్యంగా రిలీజవుతోంది.

శోభన్ కెరీర్లో హీరోగా ఏకైక హిట్ ‘ఏక్ మిని కథ’ రిలీజ్ తర్వాత మొదలైన సినిమా ‘శ్రీదేవి శోభన్ బాబు’. ఓటీటీలో రిలీజైనప్పటికీ ‘ఏక్ మిని కథ’ బాగానే సందడి చేసింది. ఆ ఊపులో సంతోష్‌తో చిరంజీవి పెద్ద కూతురు సుశ్మిత నిర్మాత ఈ సినిమాను మొదలుపెట్టింది. సినిమా పూర్తయినపుడే రిలీజ్ చేస్తే బాగుండేది. కానీ ఎందుకో ట్రైలర్ రిలీజయ్యాక సినిమా వార్తల్లో లేకుండా పోయింది. ఏడాది పాటు ఈ సినిమాను పక్కన పెట్టేసి.. ఇప్పుడు ఉన్నట్లుండి రిలీజ్‌కు రెడీ చేశారు. కానీ ఇలా ఓ చిన్న సినిమా ఒకసారి మరుగున పడ్డాక మళ్లీ హైప్ తెచ్చుకోవడం కష్టం. అందులోనూ సంతోష్ నుంచి వచ్చిన లైక్ షేర్ సబ్‌స్క్రైబ్, కళ్యాణం కమనీయం చిత్రాలు దారుణంగా బోల్తా కొట్టి అతను స్లంప్‌లో పడిపోయాడు.

ఇక ‘శ్రీదేవి శోభన్ బాబు’కు హైప్ ఎలా వస్తుంది? చిరంజీవినో, రామ్ చరణ్‌నో పిలిపించి ప్రి రిలీజ్ ఈవెంట్లో అయినా కొంచెం హడావుడి చేయాల్సింది. కానీ నాగబాబును పిలిచి మమ అనిపించారు. అసలే పోటీ గట్టిగా ఉంది. పైగా హైప్ లేదు. అలాంటపుడు ‘శ్రీదేవి శోభన్ బాబు’ను జనం ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహమే