రాధేశ్యామ్ సంగ‌తేమో కానీ.. దానికి మాత్రం ఆయ‌నే

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌‌భాస్ సినిమాల‌కు సంగీత ద‌ర్శ‌కుల ఎంపిక పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. సాహో సినిమాకు ముందు శంక‌ర్‌-ఎహ‌సాన్-లాయ్‌ల‌ను సంగీత ద‌ర్శ‌కులుగా ఎంచుకోవ‌డం.. ఆ త‌ర్వాత వాళ్లు త‌ప్పుకోవ‌డం.. చివ‌ర్లో హ‌డావుడి ప‌డి వేర్వేరు మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌తో పాటు చేయించి రిలీజ్ చేయ‌డం.. వాటికి ఆశించిన స్పంద‌న రాక‌పోవ‌డం తెలిసిందే. సాహోకు ఆడియో మైన‌స్ అయింద‌న్న‌ది స్ప‌ష్టం. ఇక ప్ర‌భాస్ కొత్త చిత్రం రాధేశ్యామ్ విష‌యంలోనూ ఇదే అయోమ‌యం క‌నిపిస్తోంది. సినిమా మొద‌లై ఏడాది దాటినా ఇంకా మ్యూజ‌క్ డైరెక్ట‌ర్ ఖ‌రార‌వ్వ‌లేదు. ఇప్పుడు రెహ‌మాన్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని.. ఆయ‌న కాదంటే త‌మ‌న్‌తో మ్యూజిక్ చేయించుకుంటార‌ని అంటున్నారు. ఇదెంత వ‌ర‌కు నిజ‌మో చూడాలి.

ఐతే వ‌రుస‌గా రెండు సినిమాల విష‌యంలో సంగీతం ద‌గ్గ‌ర అయోమ‌య స్థితి ఎదురైన నేప‌థ్యంలో ప్ర‌భాస్ త‌న త‌ర్వాతి సినిమా విష‌యంలో మాత్రం ఇలాంటి క‌న్ఫ్యూజ‌న్ ఉండొద్ద‌ని అనుకుంటూ ఉంటాడ‌న‌డంలో సందేహం లేదు.. ప్ర‌భాస్ కొత్త చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్న నాగ్ అశ్విన్ అలాంటి సందిగ్ధ‌త‌కు అవ‌కాశం లేకుండా చూస్తున్నాడ‌ట‌. వీరి క‌ల‌యిక‌లో రాబోతున్న చిత్రానికి లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి సంగీతం స‌మ‌కూర్చ‌బోతున్న‌ట్లు స‌మాచారం. బాహుబ‌లితో అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు అందుకున్న కీర‌వాణి ఉండ‌గా.. ఇంకొక‌రు ఎందుకని నాగ్ భావిస్తున్నాడ‌ట‌. కీర‌వాణితో సంప్ర‌దింపులు అయిపోయాయ‌ని.. ఆయ‌న ఈ చిత్రం చేయ‌డానికి అంగీక‌రించార‌ని.. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రాబోతోంద‌ని స‌మాచారం. ఈ చిత్రంలో దీపికా ప‌దుకొనే క‌థానాయిక‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.