ఆర్ఆర్ఆర్ కూడా ఔట్‌.. మిగిలిందిక పుష్ప ఒక్క‌టే

క‌రోనా వేళ బ‌డా బ‌డా బ‌డా సంస్థ‌లే జీతాలివ్వ‌డానికి ఇబ్బంది ప‌డిపోతున్నాయి. ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గించుకుని.. జీతాల్లో కోత‌లు పెట్టేస్తున్నాయి. ప్ర‌భుత్వాలు సైతం ఉద్యోగుల‌కు జీతాల కోత విధించాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌ది రూపాయ‌ల వ‌డ్డీల‌కు అప్పులు తెచ్చి సినిమాలు తీసే నిర్మాత‌ల ప‌రిస్థితి ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

మంచి బ్యాక‌ప్ ఉన్న నిర్మాణ సంస్థ‌లు కూడా ఊరికే త‌మ స్టాఫ్‌కు జీతాలు ఇవ్వ‌ట్లేదు. ఇండ‌స్ట్రీలో చాలా వ‌ర‌కు ప‌ని ఉంటేనే జీతం.. నో వ‌ర్క్ నో పే అన్న‌ట్లుగా న‌డుస్తుంది వ్య‌వ‌హారం. ఒక సినిమా కోసం ఆఫీస్ తెరిచాకే స్టాఫ్‌కు జీతాలిస్తారు. ఆ సినిమా ప‌ని అయిపోగానే జీతాలు ఆగిపోతాయి.

ఐతే క‌రోనా పుణ్య‌మా అని నాలుగు నెల‌ల కింద‌టే ప‌రిశ్ర‌మ‌లో అన్ని ప‌నులూ ఆగిపోయాయి. షూటింగ్స్, రిలీజ్‌లు ఉంటేనే ప‌ని, ఆదాయం పొందే కార్మికుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. కింది స్థాయి వాళ్ల‌కు సీసీసీ కింద సాయం అయినా అందుతోంది కానీ.. కొంచెం రేంజ్ ఉండి, ఒక‌ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ల‌కు ఆ సాయం తీసుకునేందుకు నామోషీగా ఉంది. అలాంటి వాళ్ల ప‌రిస్థితి అయోమ‌యంగా ఉంది. వీళ్ల‌ను ప‌ట్టించుకునే నాథుడు లేడిప్పుడు.

నిర్మాణ సంస్థ‌లు కూడా ప‌ని లేని స‌మ‌యంలో జీతాల భారం మోసే ప‌రిస్థితుల్లో లేవు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌లూ జీతాలు ఆపేయ‌గా.. పుష్ప‌, ఆర్ఆర్ఆర్ టీంలు మాత్రం స్టాఫ్‌కు జీతాలిస్తూ వ‌స్తున్నాయి. రాజ‌మౌళి, సుకుమార్‌ల‌కున్న వాల్యూ వ‌ల్ల నిర్మాణ సంస్థ‌లు చిత్ర బృందంలోని వారికి కొంచెం కోత‌ల‌తో అయినా జీతాలిస్తూ వ‌చ్చాయి.

ఐతే తాజా స‌మాచారం ప్ర‌కారం ఆర్ఆర్ఆర్ టీం కూడా ఈ మ‌ధ్యే జీతాలు ఆపేసింద‌ట‌. షూటింగ్ పునఃప్రారంభించాల‌ని అనుకున్నా.. అందుకు వీలుప‌డ‌క‌పోవ‌డంతో ప‌రిస్థితులు బాగుప‌డే వ‌ర‌కు ఎదురు చూడాల‌ని నిర్ణ‌యించార‌ట‌. దీంతో స్టాఫ్‌కు జీతాలు ఆపేశారంటున్నారు. ఐతే సుకుమార్ మాత్రం త‌న పుష్ప టీం స‌భ్యుల‌కు కాస్తో కూస్తో ప‌ని ఇస్తూ.. మైత్రీ వాళ్ల నుంచి స‌గం జీతాలైనా అందేలా చూస్తున్న‌ట్లు తెలిసింది.