వర్మ హింట్ ఇచ్చాడు.. వాళ్లు చెలరేగిపోయేలా ఉన్నారు

రామ్ గోపాల్ వర్మ సినిమాల క్వాలిటీ గురించి మాట్లాడుకునే పరిస్థితి ఇప్పుడు ఎంతమాత్రం లేదు కానీ.. ఆయన ఇటీవల ఓ సంచలన మార్పుకి శ్రీకారం చుట్టి సినీ పరిశ్రమకు మార్గనిర్దేశం చేశాడు. థియేట్రికల్ రిలీజ్‌కు అవకాశం లేని ఈ పరిస్థితుల్లో అందరూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వైపు చూస్తుంటే.. ఆయనే సొంతంగా తన సినిమాల కోసం ఓ ఫ్లాట్ ఫామ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.

శ్రేయాస్ మీడియాతో కలిసి ఆయన ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ పేరుతో ఏటీటీ ఫ్లాట్ ఓపెన్ చేశాడు. పే పర్ వ్యూ పద్ధతిలో ఒకసారి లాగిన్ అయి, ఇంత అని డబ్బులు కట్టి సినిమా చూసే అవకాశం కల్పించాడు వర్మ. ఏడాది మొత్తానికి ఓటీటీ ఫ్లాట్ ఫాంలో సబ్‌స్క్రిప్షన్ తీసుకుని సినిమాలు చూసే జనాలు ఇలా ఒక సినిమాకు వంద, రెండొందలు పెట్టి సినిమా చూస్తారా అన్న సందేహాల్ని వర్మ పటాపంచలు చేశాడు.

ఆర్జీవీ తీసిన నాసిరకం సినిమాల్ని కూడా లక్షల మంది డబ్బులు పెట్టి చూడటం ఆశ్చర్యం కలిగించే విషయమే. అలాంటిది మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని ఇలా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మిగతా నిర్మాతల్లో కలిగింది. ఐతే టాలీవుడ్ నుంచి ఈ పద్ధతిని ఎంతమంది అందిపుచ్చుకుంటారో కానీ.. తమిళంలో మాత్రం ఓ ప్రముఖ ఫిలిం మేకర్ వర్మ నుంచి స్ఫూర్తి పొందాడు. అతనే.. సీవీ కుమార్. తమిళంలో కొన్ని అద్భుతమైన సినిమాలను నిర్మించిన కుమార్.. సందీప్ కిషన్ హీరోగా ‘మాయవన్’ (తెలుగులో ప్రాజెక్ట్ జడ్) పేరుతో తనే సొంతంగా ఓ మంచి సినిమా తీశాడు. దీని తర్వాత అతడి జోరు కొంచెం తగ్గింది. ఇప్పుడు కుమార్ ‘రీగల్ ట్యాకీస్’ పేరుతో ఒక యాప్ తీసుకొచ్చాడు.

వర్మ మొదలుపెట్టిన తరహాలోనే ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో సినిమా చూసే ఫ్లాట్ ఫామ్ ఇది. ఐతే వర్మ వెబ్ సైట్ ద్వారా సినిమా చూసే అవకాశం కల్పిస్తే.. కుమార్ ఇందుకోసం యాప్‌నే తీసుకొచ్చాడు. ఇందులో తన సినిమాలతో పాటు.. తన భాగస్వామ్యంతో వేరే వాళ్ల సినిమాలనూ రిలీజ్ చేయడానికి కుమార్ రంగం సిద్ధం చేశాడు. కోలీవుడ్లో ఇదొక సెన్సేషన్ అవుతుందని అంచనా వేస్తున్నారు.