జితేంద్ర హెచ్చ‌రిక‌.. చిరు డోంట్ కేర్

మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు స్టార్ హీరోలున్నారు. ఆ త‌ర్వాత స్టార్లున్నారు. కానీ ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌మందికి ఎవ‌రు స్ఫూర్తి అంటే మాత్రం చిరు పేరే చెబుతారు. కొత్త‌గా సినిమాల్లోకి వ‌స్తున్న ఈ త‌రం వాళ్లు కూడా త‌మ‌కు మెగాస్టారే స్ఫూర్తి అంటారు.

అతి సామాన్య నేప‌థ్యం నుంచి వ‌చ్చి మొద‌ట్లో చిన్న పాత్ర‌లు చేసి.. ఆ త‌ర్వాత అవ‌కాశాల్ని అందిపుచ్చుకుంటూ.. క‌ష్ట‌ప‌డి మెగాస్టార్ స్థాయికి ఎదిగిన వైనం ఎవ‌రికైనా స్ఫూర్తిదాయ‌క‌మే. అంతే కాదు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌టం.. ఎప్పుడూ నిర్మాత‌ల శ్రేయ‌స్సు కోరుకోవ‌డం చిరును ప్ర‌త్యేకంగా నిల‌బెట్టే విష‌యాలు. ఆయ‌న గొప్ప మ‌న‌సు గురించి ఇండ‌స్ట్రీ జ‌నాలు క‌థ‌లు క‌థ‌లుగా చెబుతారు.

చిరులోని అత్యంత గొప్ప ల‌క్ష‌ణం.. ఈ త‌రం స్టార్లు నేర్చుకోవాల్సిన విష‌యం.. ఆయ‌న సినిమా పూర్త‌య్యాక కానీ పారితోష‌కం తీసుకోక‌పోవ‌డం. కెరీర్ ఆరంభం నుంచి చిరుకు సినిమా మొద‌ల‌య్యే ముందు అడ్వాన్స్ తీసుకునే అల‌వాటు లేదు. సినిమా అంతా అయ్యాకే పారితోష‌కం తీసుకుంటాడు. ఈ విష‌యంలో ఒక సంద‌ర్భంలో బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర‌.. చిరును హెచ్చ‌రించాడ‌ట‌.

సినిమా పూర్త‌య్యాక నిర్మాత‌లు చేతులెత్తేస్తే ప‌రిస్థితి ఏంట‌ని.. అడ్వాన్స్ తీసుకోమ‌ని అన్నాడ‌ట‌. కానీ చిరు ఆ మాట‌ను ప‌ట్టించుకోకుండా సినిమా పూర్త‌య్యాకే పారితోష‌కం తీసుకునే ఆన‌వాయితీని కొన‌సాగిస్తున్న‌ట్లు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఆన‌వాయితీని త‌న కొడుకు రామ్ చ‌ర‌ణ్ కూడా కొన‌సాగిస్తున్నాడ‌ని.. ఈ త‌రంలో ఇంకెవ‌రైనా అలా చేస్తున్నారో లేదో త‌న‌కు తెలియ‌ద‌ని చిరు అన్నాడు. ఇక త‌న కెరీర్లో తాను చూసిన అత్యుత్త‌మ నిర్మాత‌ల్లో చ‌ర‌ణ్ ఒక‌డ‌నిఈ ఇంట‌ర్వ్యూలో చిరు కితాబివ్వ‌డం విశేషం.