అండ్ ద సంక్రాంతి విన్నర్ ఈజ్..

మొత్తానికి సంక్రాంతి సినిమాల లెక్క తేలిపోయింది. కరోనా విరామం తర్వాత సినిమాలకు అంతగా అనుకూల పరిస్థితులు లేకపోయినా, థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నప్పటికీ ఎప్పట్లాగే ఈ పండక్కి కూడా నాలుగు సినిమాలు రిలీజ్ కావడం విశేషమే. అందులో ఒకటి తమిళ డబ్బింగ్ సినిమా కాగా.. మిగతా మూడు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలే. మరి ఈ నాలుగు చిత్రాలూ విడుదైలపోయిన నేపథ్యంలో ఈసారి సంక్రాంతి విజేత ఏది అని తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది.

సంక్రాంతి రేసులో మొదటగా ప్రేక్షకులను పలకరించిన ‘క్రాక్’ మూవీనే 2021 సంక్రాంతి విజేత అనడంలో మరో మాట లేదు. ఆ చిత్రానికే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చాయి. అన్నింట్లోకి మెరుగైన టాక్ తెచ్చుకున్న సినిమా కూడా అదే. జనవరి 9న, తొలి రోజు అనేక అడ్డంకుల మధ్య అతి కష్టం మీద సెకండ్ షోల సమయానికి పరిమిత సంఖ్యలో థియేటర్లలో విడుదలైనప్పటికీ ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో తర్వాతి రోజైన ఆదివారం ‘క్రాక్’ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

తొలి రోజు అడ్డంకుల నేపథ్యంలో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుభూతి కూడా తోడై వసూళ్లు పెరిగాయని ట్రేడ్ పండిట్లు అంచనా వేశారు. వీక్ డేస్‌లో కూడా ‘క్రాక్’ జోరు కొనసాగగా.. 13, 14 తేదీల్లో రిలీజైన మూడు సినిమాల పోటీని కూడా తట్టుకుని ఆ చిత్రం నిలబడింది.

ఇక సంక్రాంతి రేసులో వచ్చిన రెండో సినిమా, తమిళ అనువాద చిత్రం ‘మాస్టర్’కు బంపర్ క్రేజ్ వచ్చింది. అది ఓపెనింగ్స్‌కు బాగా ఉపయోగపడింది. కానీ సినిమాకు డివైడ్ టాక్ రావడం ప్రభావం చూపింది. రెండో రోజు నుంచి ఈ సినిమా డల్ అయింది. ఇక పండుగ రోజైన గురువారం విడుదలైన రెండు చిత్రాల్లో ఒకటైన ‘అల్లుడు అదుర్స్’కు ప్రేక్షకుల నుంచి పూర్తిగా తిరస్కారమే ఎదురైంది.

ఈ సినిమా గురించి చెప్పడానికి ఏమీ లేదు. రామ్ ‘రెడ్’కు సైతం ఆశించినంత మంచి టాక్ రాలేదు. కాకపోతే మాస్టర్, అల్లుడు అదుర్స్‌తో పోలిస్తే దీని పరిస్థితి మెరుగు అని చెప్పొచ్చు. మొత్తంగా సంక్రాంతి సినిమాల్లో టాక్, బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ పరంగా చివరికి క్రాక్, రెడ్, మాస్టర్, అల్లుడు అదుర్స్ వరుస క్రమంలో నిలుస్తాయని చెప్పొచ్చు.