తారకరత్న కాదు.. తారక్

నందమూరి కుటుంబం నుంచి అత్యధిక అంచనాలతో హీరోగా అడుగు పెట్టిన నటుడు నందమూరి తారకరత్న. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు కూడా లేని హైప్ అతడి అరంగేట్రానికి వచ్చింది. ఒకేసారి తొమ్మిది సినిమాలు మొదలుపెడితే హైప్ రాకుండా ఎలా ఉంటుంది? కానీ ఆ తొమ్మిది సినిమాల్లో నాలుగైదు సినిమాలు మొదలే కాకపోవడం.. పూర్తయినవి అడ్రస్ లేకుండా పోవడం.. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో ఇప్పటిదాకా తారకరత్నకు ఒక్కటంటే ఒక్క హిట్టు లేకపోవడమే విచారకరం.

హిట్టు కోసం తారకరత్న చేయని ప్రయత్నం లేదు. కానీ ఏదీ కలిసి రాలేదు. ఒక దశ దాటాక అతణ్ని అందరూ పట్టించుకోవడం మానేశారు. అయినా అతను మాత్రం సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అతడి నుంచి ‘దేవినేని’ అనే పొలిటికల్ మూవీ రాబోతుండటం గమనార్హం.

ఇంతుకముందు విజయవాడ రాజకీయాల నేపథ్యంలో ‘వంగవీటి’ అనే సినిమా తీశాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు వంగవీటి కుటుంబానికి బద్ధ శత్రువులుగా భావించే దేవినేని కుటుంబం మీద తారకరత్న ఫోకస్ పెట్టినట్లున్నాడు. కత్తి పట్టి రక్తపాతానికి సై అంటున్న తారకరత్న లుక్‌తో ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. నర్రా శివనాగు అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. జీఎస్సార్, రాము రాథోడ్ ‘దేవినేని’కి నిర్మాతలు. ఫామ్‌లో లేని సీనియర్ సంగీత దర్శకుడు కోటి ఈ చిత్రానికి మ్యూజిక్ చేస్తున్నాడు.

ఈ సినిమా కోసం తారకరత్న పేరు మార్చుకోవడం విశేషం. ‘నందమూరి తారక్’ అంటూ మోషన్ పోస్టర్లో కొత్తగా అతడి పేరును ప్రెజెంట్ చేశారు. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్‌ను అందరూ తారక్ అంటారన్న సంగతి తెలిసిందే. అతడి పేరును తీసుకుంటే తనకు కూడా సక్సెస్ వస్తుందని ఆశించాడేమో తారకరత్న. మరి ఈ సినిమా అయినా అతను రెండు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న తొలి విజయాన్ని తీసుకొస్తుందేమో చూడాలి.