క్ష‌మాప‌ణ చెప్పిన హీరో

దేవుడు, మ‌తం లాంటి వ్య‌వ‌హారాల్లో వ్యాఖ్య‌లు చేసేట‌పుడు ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలో చెప్ప‌డానికి ఈ ఉదంతం ఉదాహ‌ర‌ణ‌. బాలీవుడ్లో వివాద ర‌హితుడిగా పేరున్న సైఫ్ అలీఖాన్.. తాను చేయ‌బోయే కొత్త సినిమా గురించి మాట్లాడుతూ చేసిన ఓ వ్యాఖ్య దుమారం రేపింది. అత‌ను ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్క‌నున్న ఆదిపురుష్‌లో రావ‌ణుడిని పోలిన లంకేష్ పాత్రకు ఎంపికైన సంగ‌తి తెలిసిందే.

కాగా ఈ సినిమా విశేషాల గురించి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. రాముడు త‌న చెల్లెలు శూర్ప‌ణ‌క ముక్కు కోసినందుకు ప్ర‌తీకారంగా రావ‌ణుడు సీత‌ను ఎందుకు అప‌హ‌రించాడో, రాముడితో ఎందుకు యుద్ధం చేశాడో స‌హేతుకంగా చూపిస్తామ‌ని సైఫ్ వ్యాఖ్యానించడంపై సోష‌ల్ మీడియాలో నిన్న‌ట్నుంచి పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

రాక్ష‌సుడైన రావ‌ణుడిని ఆదిపురుష్‌లో హీరోగా చూపిస్తారా అంటూ చిత్ర బృందాన్ని ప్ర‌శ్నించారు. హిందువుల మ‌నోభావాలు దెబ్బ తీశాడ‌ని సైఫ్ మీద మండిప‌డ్డారు. ఐతే వ్య‌వ‌హారం సీరియ‌స్ అయ్యేలా ఉంద‌ని గ్ర‌హించిన సైఫ్ ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా త‌న వివ‌ర‌ణ ఇచ్చేశాడు. అత‌ను త‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్ప‌డ‌మే కాదు.. త‌న వ్యాఖ్య‌ల్ని వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

త‌న వ్యాఖ్య‌ల్లో దురుద్దేశం ఏమీ లేద‌ని.. ఎవ‌రి మ‌నోభావాలూ కించ‌ప‌ర‌చ‌ద‌లుచుకోలేద‌ని అత‌ను పేర్కొన్నాడు. రాముడు మంచికి, వీర‌త్వానికి ప్ర‌తీక అని.. చెడుపై మంచి విజ‌యాన్ని ప్ర‌తిబింబించేలా ఆదిపురుష్ ఉంటుంద‌ని, వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రించ‌కుండా ఆదిపురుష్‌ను అత్యుత్త‌మంగా తీర్చిదిద్దే ప్ర‌యత్రం చిత్ర బృందం చేస్తుంద‌ని అత‌ను స్ప‌ష్టం చేశాడు.