సింహా పదేళ్ళు.. బోయపాటి తెలుసుకున్నాడా?

నందమూరి బాలకృష్ణ సినిమాలను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోవడం మానేసిన టైమ్‌లో వచ్చింది ‘సింహా’. ‘లక్ష్మీనరసింహా’ తర్వాత బాలయ్యకు ఆరేళ్ల పాటు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఏడు డిజాస్టర్స్ రావడంతో డీలా పడిన నందమూరి ఫ్యాన్స్‌కు బంపర్ ట్రీట్ ఇచ్చాడు బోయపాటి. 2010, మే 30న విడుదలైన ‘సింహా’ బాలయ్య క్రేజ్‌ను మరోసారి అమాంతం పైకి లేపింది. 2010లో బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలై, పదేళ్లు గడుస్తున్నా దర్శకుడు బోయపాటి శ్రీనులో మాత్రం మార్పు రావడం లేదు.

‘సింహా’ సినిమాను ముందుగా 125 రోజుల్లో పూర్తి చేయాలని అనుకున్నారు. అయితే బాలకృష్ణ డెడికేషన్‌కి బోయపాటి పనితనం తోడు కావడంతో ‘సింహా’ షూటింగ్ 112 రోజుల్లోనే పూర్తయ్యింది. అయితే 112 రోజులంటే ఓ సినిమా పూర్తిచేయడానికి చాలా ఎక్కువ సమయం అంటున్నారు టాలీవుడ్ పెద్దలు. పెద్ద సినిమాలను 70 రోజుల్లో పూర్తిచేస్తే, బడ్జెట్ కంట్రోల్‌లో ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి ఆలోచన. తన సినిమాల విషయంలో ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు మెగాస్టార్. అలాగే ఈ మధ్యనే సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా రికార్డు స్థాయిలో పూర్తి చేసుకుని చిరంజీవి ప్రశంసలు కూడా అందుకుంది.

ఇక బోయపాటి విషయానికి వస్తే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో తీసిన ‘జయజానకి నాయక’ చిత్రానికి మాస్ ఏరియాల్లో మంచి ఆదరణ దక్కింది. అయితే బెల్లంకొండ మార్కెట్‌కి మించి ఖర్చు చేయడంతో బాక్సాఫీస్ దగ్గర రూ.35 కోట్ల వసూళ్లు రాబట్టినా, ఫెయిల్యూర్‌గానే నిలిచింది. ‘సరైనోడు’, ‘వినయవిధేయ రామ’ చిత్రాల విషయంలో కూడా ఆల్ మోస్ట్ సేమ్ సీన్. వీటికోసం కూడా వంద రోజులకి పైగానే షూటింగ్ చేయాల్సి వచ్చింది. సినిమా షూటింగ్‌ దినాలను తగ్గిస్తే, బడ్జెట్ కంట్రోల్ అవుతుంది. కానీ బోయపాటి ఆ విషయంలో తగ్గడం లేదు. మరి బోయపాటి, బాలయ్యతో చేయబోతున్న నెక్ట్స్ ప్రాజెక్ట్‌కైనా పనిదినాలను తగ్గిస్తాడేమో చూడాలి.

‘సింహా’, ‘లెజెండ్’ వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కబోతోంది.