శ్రీదేవి లేనిదే జగదేకవీరుడు లేడు -మెగాస్టార్

టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్టర్ సినిమా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. శతాధిక చిత్రాల దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ ‘వైజయంతి మూవీస్’బ్యానర్‌లో ఓ మైలురాయి లాంటి ఈ సినిమా వచ్చి సరిగ్గా 30 ఏళ్లు. ఈ సందర్భంగా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ మూవీకి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తోంది వైజయంతి మూవీస్. తాజాగా హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు సంబంధించిన అనుభవాలను వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

‘జగదీక వీరుడు- అతిలోకసుందరి ఓ ఎవర్‌గ్రీన్ క్లాసిక్. తెలుగు సినీ చరిత్రలో టాప్ 25 మూవీస్‌లో ఒకటిగా ఉంటుంది. ఇలాంటి సినిమాలో నాకు అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. జగదేకవీరుడి సక్సెస్ క్రెడిట్‌లో చాలా భాగం దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకే దక్కుతుంది. ఓ శిల్పిలాగ ఓ దీక్షతో ఈ సినిమాను చెక్కారు రాఘవేంద్రరావు. ఈ మూవీకి ముందు కొన్ని ఫ్లాపులు రావడం వల్లే ఆయనలో ఇంత కసి వచ్చి ఉండవచ్చని’ అన్నారు మెగాస్టార్.

అలాగే హీరోయిన్ గురించి మాట్లాడుతూ ‘శ్రీదేవి లేనిదే ఈ సినిమా లేదు… అతిలోక సుందరిగా శ్రీదేవిని తప్ప మరో హీరోయిన్‌ను ఊహించుకోలేం… అమాయకత్వం కలిసిన చూపులతో, దేవతా రూపంలో ఇమిడి ఆ పాత్రలో జీవించింది శ్రీదేవి. ఆమె లుక్స్‌తో మ్యాచ్ అయ్యేందుకు నేను శ్రమపడుతూ పోటీపడాల్సి వచ్చింది…’ అన్నారు మెగాస్టార్.

ఎంత డబ్బు మిగిలింది అనేదానికంటే ఎంత కీర్తి వస్తుందని ఆలోచించే నిర్మాత అశ్వినీదత్‌కి… మాస్, క్లాస్ ప్రేక్షకుల కోసం ఆణిముత్యాల్లాంటి పాటలు రాసిన వేటూరికి, వీఎఫ్ఎక్స్ లేని రోజుల్లో అత్యద్భుతంగా సోషియో ఫాంటసీని కళ్లకు కట్టేలా తీసిన ఫోటోగ్రాఫర్ వింసెంట్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చిరూ… ఈ మూవీలో సూపర్ హిట్టైన ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ పాటను కొన్ని గంటల్లోనే రాయడం, రికార్డు చేయడం, తీయడం పూర్తిచేశామని చెప్పారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతీ ఒక్క టెక్నిషియన్‌కి అభినందనలు తెలిపిన మెగాస్టార్… నటుడిగా ఇలాంటి సినిమా చేసినందుకు ఎంతో గర్విస్తున్నానని అన్నారు.

30 ఏళ్ల క్రితమే రూ.8 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ మూవీ… మే 9, 1990న విడుదలై బాల్కనీ టికెట్ రూ.5 ఉన్న రోజుల్లోనే రూ.13 కోట్ల కలెక్షన్లు సాధించి అప్పటిదాకా ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది.