కరోనా మరణాలను భారత్ దాచిపెడుతోంది: ట్రంప్

కరోనా విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్లక్ష్యం వహించారని, అందుకే లక్షలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కరోనా వైరస్‌ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని…కరోనాతో జీవితాలు ముగిసిపోలేదని, ఆర్థికాభివృద్ధి ఆగిపోలేదని….కరోనా ఓ ఫ్లూ వంటిదని ట్రంప్ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారని విపక్షాలు విమర్శించాయి.

కరోనాకు భయపడి దేశం మొత్తం లాక్ డౌన్ విధించనంటూ ట్రంప్ మొండిపట్టు పట్టడంపై డెమోక్రాట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ కరోనా విషయంలో తన చర్యలను ట్రంప్ సమర్థించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ మరోసారి కరోనా విషయంలో తానే కరెక్టంటూ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం వ్యూహాత్మక చర్యల వల్లే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తక్కువగా నమోదైందని తనను తాను సమర్థించుకున్నారు ట్రంప్. అంతేకాదు, ఈ క్రమంలో భారత్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో కరోనా లెక్కలు తప్పుల తడకలంటూ ట్రంప్ షాకింగ్ కామెంట్లు చేశారు.

మరికొద్ది రోజుల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థి బైడెన్ లు ముమ్మురంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. లక్షలాది మంది అమెరికన్లు కరోనా బారినపడి చనిపోవడానికి ట్రంప్ కారణమని, కరోనా కట్టడి విషయంలో ట్రంప్ నకు ఎలాంటి ప్రణాళికలు లేవని బైడెన్ విమర్శించారు.

ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రజలకు ఇవ్వాలని.. విపత్తు సమయంలో వారిని ఆదుకోవాలని తాను చెప్పినా ట్రంప్ వినలేదని అన్నారు. దీనిపై స్పందించిన ట్రంప్ కోవిడ్ 19 పూర్తిగా చైనా తప్పిదం అంటూ వ్యాఖ్యానించారు. తన చర్యల వల్లే కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయని, చైనా, భారత్, రష్యాలు కరోనా గణాంకాలు కచ్చితంగా వెల్లడించవని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మరి కొద్ది వారాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.