టీడీపీకి ఊహించని షాక్.. గద్దె రాజీనామా

తెలుగుదేశంపార్టీకి ఊహిచని షాక్ తగిలింది. ఎన్టీయార్ పార్టీని పెట్టినప్పటి నుండి పనిచేస్తున్న సీనియర్ నేత గద్దె బాబూరావు ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు. బాబూరావు విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంఎల్ఏగా పనిచేశారు. ఒకసారి ఎంఎల్సీగా పనిచేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన గద్దె విజయనగరం జిల్లాలోని సీనియర్ నేతల్లో ఒకరు. అలాగే ఉత్తరాంధ్రలోని పార్టీ బీసీ నేతల్లో కీలకంగా ఉంటున్నారు. అలాంటిది హఠాత్తుగా గద్దె పార్టీకి రాజీనామా చేస్తారని ఎవరూ అనుకోలేదు.

రాజీనామా చేసిన గద్దె మాట్లాడుతూ ఇపుడున్నది ఎన్టీయార్ స్ధాపించిన టిడిపి కాదన్నారు. పార్టీకి రాజీనామా చేసిన వెంటనే గద్దె ఇటువంటి కామెంట్లు చేయటమే విచిత్రంగా ఉంది. పార్టీ నుండి ఎన్టీయార్ ను పంపేసి సుమారు 25 ఏళ్ళవుతోంది. ముఖ్యమంత్రిగా దింపేసి, అధ్యక్షుడిగా దింపేసిన ఇన్ని సంవత్సరాలకు బాబురావు ఇటువంటి కామెంట్లు చేయటమంటే ప్రత్యేకమైన అజెండా ఉన్నట్లు అర్ధమవుతోంది. పైగా పార్టీలో సీనియర్లకి గౌరవం లేదనటం కూడా ఆశ్చర్యమనే చెప్పాలి.

జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల తర్వాతే ఉత్తరాంధ్రలోని టిడిపి నేతల్లో అంతర్మధనం మొదలైందన్నది వాస్తవం. జగన్ ప్రకటించిన రాజధానిగా విశాఖనగరాన్ని వ్యతిరేకించలేక అలాగాని బహిరంగంగా మద్దతు ప్రకటించలేక చాలామంది టిడిపి నేతలు అవస్తలు పడుతున్నారు. ఇందులో భాగంగానే మొన్ననే ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీకి రాజీనామా చేసేశారు. జగన్ ప్రకటన చేయగానే స్వాగతిస్తు మాజీ ఎంఎల్ఏ రహమాన్ లాంటి వాళ్ళు టిడిపికి రాజీనామా చేసేసి వైసిపిలో చేరిన విషయం గుర్తుండే ఉంటుంది.

మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత విజయనగరం జిల్లాలో టిడిపి అసలు ఇబ్బంది పడుతోంది. ఎందుకంటే జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవలేదు. ఉన్న ఎంపి స్ధానంలో కూడా వైసిపినే గెలిచింది. దానికితోడు దశాబ్దాల పాటు పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతి రాజు కూడా వయస్సయిపోయింది. ప్రస్తుతం రాజుగారు 76 ఏళ్ళలో అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో మరో సీనియర్ నేత రాజీనామా అంటే పార్టీకి ఇబ్బందనే చెప్పాలి.