రాబోయే రోజుల్లో రచ్చ ఎంతో చెప్పేసిన ట్రంప్

తొలిసారి అమెరికన్లు రచ్చ రాజకీయాల్ని చూడబోతున్నారా? లోపల ఎలా చచ్చినా పైకి మాత్రం హుందాగా తమ రాజకీయాలు ఉన్నట్లుగా కలరింగ్ ఇవ్వటం మామూలే. కాకుంటే.. మనకు మాదిరి పోలింగ్ బూతుల్ని స్వాధీనం చేసుకోవటం.. తుపాకులతో హల్ చల్ చేయటం.. రక్తం వచ్చేట్లు కొట్టుకోవటం.. కత్తులతో స్వైర విహారం చేయటం.. బాంబులు విసురుకోవటం లాంటివి చూడం. కానీ.. ఈసారి అలాంటివి కాకుండా.. కొత్త తరహా రచ్చలకు కేరాఫ్ అడ్రస్ గా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

దీనికి కారణం లేకపోలేదు. తాను ఎన్నికల్లో ఓడితే.. అధికార బదిలీ అంత ప్రశాంతంగా జరగకపోవచ్చంటూ ట్రంప్ వారు చేసిన వ్యాఖ్య ఇప్పుడు దుమారంగా మారింది. ఇప్పటివరకు ఈ తరహా మాటల్ని ఏ అధ్యక్షుల వారి నోటి నుంచి వచ్చింది లేదు. ప్రపంచ ప్రజాస్వామ్యానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పే అమెరికాలో.. ఇలాంటి పరిస్థితా? అధ్యక్షుడిగా వ్యవహరించే పెద్ద మనిషి మాట్లాడాల్సిన మాటలేనా? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి.

పోస్టల్ బ్యాలెట్ మీద తనకు మొదటి నుంచి అభ్యంతరాలు ఉన్నాయని చెప్పిన ట్రంప్.. తాజాగా మరోసారి అనుమానం వ్యక్తం చేస్తూ.. ఓడితే అధికార బదిలీ విషయంలో ఏమవుతుందో చూడాలన్నారు. అవసరమైతే ఫలితాలపై సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని చెప్పిన మాటపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ తాజాగా స్పందించింది. అధ్యక్షుల వారి మాటకు వివరణ ఇచ్చింది. అన్ని సజావుగా.. పారదర్శకంగా జరిగితే ఎన్నికల ఫలితాల్ని ట్రంప్ స్వీకరిస్తారని వైట్ హౌస్ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.

మరోవైపు ట్రంప్ కు అనుకూలంగా ఫలితం వస్తే.. ఈసారి ఫలితాన్ని తాము ఒప్పుకునేది లేదని డెమొక్రాట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ఎవరికి వారు మేం ఒప్పుకోమంటే.. మేం ఒప్పుకోమంటూ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. రోటీన్ కు భిన్నంగా ఈసారి ఎన్నికలు రచ్చ.. రచ్చగా మారటం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే.. రచ్చ రాజకీయాల్ని చూసే రోజు అమెరికన్లకు దగ్గరలోనే ఉందని చెప్పక తప్పదు.