తన్నుకోండి.. చోద్యం చూస్తాం

తన్నుకోండి.. చోద్యం చూస్తాం

పెద్దన్న అంటే ఎలా ఉండాలి? పెద్దరికంతో వ్యవహరిస్తూ.. చిన్నోళ్లు దేని గురించైనా పేచీ పడుతుంటే సర్ది చెప్పాలి.  మంచేదో.. చెడు ఏదో వివరించాలి.అంతేకానీ.. కొట్టుకు చావండంటూ ఇద్దరికి కర్రలు ఇస్తుంటే దాన్నేమనాలి?సరిగ్గా కాంగ్రెస్ పార్టీ ఇదే పని చేస్తోంది. తెలంగాణ మీద జరుగుతున్నరచ్చ ఇప్పటి కాదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే.. సీమాంధ్ర నేతలు సమైక్యంగా ఉంచాలంటారు. ఇది రావణకాష్ఠంలా కాలుతూనే ఉంది. దీని కారణంగా ఎందరో అమాయకులు బలయ్యారు. వేలాది కోట్ల రూపాయిలు.. అభివృద్ధిని రాష్ట్రం నష్టపోయింది. అయినా.. ఈ విషయాన్నితేల్చేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పటికీ కన్ఫ్యూజన్ లోఉంది.

రాయల తెలంగాణకు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినా.. ఏదో తెలీని సందేహం ఆ పార్టీని వెంటాడుతోంది. విభజించి.. అధికారాన్ని పొందాలని భావిస్తున్నఆ పార్టీకి తమ ప్లాన్ ఎక్కడ తంతుందోనన్న భయం వెంటాడుతోంది.అందులో భాగంగా.. ఇరు ప్రాంత ప్రజల మనసులు తెలుసుకునే ప్రయత్నం అంటూ అనవసర ఉద్రిక్తతలకు తావిస్తుంది. తెలంగాణపై నిర్ణయం 2014 ఎన్నికల తర్వాత అని ఒక అభిప్రాయానికి రాష్ట్రంలోని ప్రజలంతా వచ్చారనే చెప్పాలి. అందుకు తగ్గట్లే టీఆర్ఎస్ పార్టీ తన శ్రేణుల్ని సమాయుత్తం చేస్తుంది కూడా.  అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ విభజన తేనతుట్టెను కదిల్చింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలంగాణ సాధన సభను ఏర్పాటు చేసి తమ ఆకాంక్షను వెలిబుచ్చటంతో పాటు..తెలంగాణ వచ్చేసినట్లే అన్న వాదనను తెరపైకి తీసుకురావటంతో సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది.

దీంతో ఇరు ప్రాంతాలు వేడెక్కాయి. తమ చిరకాల వాంఛను గౌరవించాలని తెలంగాణవాదులు, అదెట్లా కుదురుతుంది.. సమైక్యం కోసం తామెన్నో త్యాగాలు చేశామని సమైక్యవాదుల వాయిస్ పెంచుతున్నారు. ఇందులో భాగంగా తమ బలం చాటేందుకు తమ ప్రాంతంలో సభలు ఏర్పాటు చేస్తామని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అధిష్ఠానాన్ని అడుగుతున్నారు. వారి నుంచి వస్తున్న ఒత్తిడితో ‘‘సర్లే .. పార్టీ విధానాన్ని మీరకండి. ఇతర ప్రాంతాల వారు నొచ్చుకునేలా మాట్లాడకండి’’ అంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మన అమాయకత్వం కాకపోతే.. బల నిరూపణ కోసం ఏర్పాటు చేసే సభలను కాస్తంత స్పైసీగా జరిగేలా చూస్తారే కానీ సో..సోగా నడపరు కదా. అలాంటప్పుడు అత్యుత్సాహంతో చేసే ప్రకటనలు మరింత ఉద్రిక్తతలకు దారి తీయకుండా ఉండలేవు కదా? అన్నది సందేహం.

అయినా.. తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయటం ద్వారా మరిన్ని చిక్కుముళ్లు పడటం తప్పించి మరోటి ఉండదు. సభలకు సరేనన్న దిగ్విజయ్ చివర్లో ఒక మాట చెప్పేశారు. ‘‘మీరు సభ పెట్టుకుంటే పెట్టుకోండి. కానీ.. పార్టీ నిర్ణయాన్ని మాత్రం మీరంతా ఒప్పుకోవాల్సి ఉంటుంది’’ అని షరతు పెట్టారు. దానికి సీమాంధ్ర నేతలు సరేనన్నారు.అంటే..వచ్చే నిర్ణయం ఎటూ వస్తుంది. దాన్ని తప్పనిసరిగా అంగీకరించాలి.కాకపోతే.. చూశారా.. మేం ఎంతో ప్రయత్నించామని చెప్పుకోవటానికే తప్ప సభల వల్ల ప్రయోజనం శూన్యం అన్నది సత్యం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు