కశ్యప్‌పై ఆరోపణల్ని నమ్మట్లేదా?

‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా ఫిలిం ఇండస్ట్రీలో అనేకమంది ఎందరో ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఐతే కొందరు ఎన్నో ఏళ్ల పాటు గుండెల్లో దాచుకున్న బాధను ఈ సందర్భంలో బయటపెడితే.. ఇంకొందరేమో ఇదే అదనుగా భావించి కొందరిపై అసత్య ఆరోపణలు చేసి ఈ ఉద్యమాన్నే పక్కదోవ పట్టించేశారన్న విమర్శలు వచ్చాయి.

ఈ ఆరోపణల్లో చాలా వాటికి ఆధారాలు ఉండవు కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడం జనాలకు కష్టమైపోయింది. ఆయా వ్యక్తులకు ఉన్న క్రెడిబిలిటీ.. అవతల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వ్యక్తిత్వం, నడవడికను బట్టి జనాలు ఒక నిర్ణయానికి వస్తున్నారు. తాజాగా తెలుగు సినిమాల్లో కూడా నటించిన ముంబయి భామ పాయల్ .. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మీద తీవ్ర ఆరోపణలే చేసింది.

సోషల్ మీడియా ట్రెండ్స్‌ను పరిశీలించినా.. అనురాగ్ గురించి బాలీవుడ్ జనాల అభిప్రాయాలు పరిశీలించినా.. అతడి మీద ఆరోపణల్ని జనాలు పెద్దగా నమ్మట్లేదనే అభిప్రాయం కలుగుతోంది. అనురాగ్‌తో విభేదాలొచ్చి అతడి నుంచి విడిపోయిన మాజీ భార్య కల్కి కొచ్లిన్ సైతం పరోక్షంగా పాయల్ ఆరోపణల్ని ఖండించింది. తన సినిమాల ద్వారానే కాక బయట కూడా మహిళల సాధికారత కోసం అనురాగ్ ఎంతగా తపిస్తాడో.. తనతో రిలేషన్‌షిప్‌ మొదలవడానికి ముందు, తన నుంచి విడిపోయాక అనురాగ్ తనకెలా సపోర్ట్ చేశాడో ఆమె వివరించింది. అలాగే తాప్సి పన్ను, మరికొందరు అమ్మాయిలు అనురాగ్‌కు మద్దతుగా ముందుకొచ్చారు.

అనురాగ్‌కు ‘సత్య’ సినిమాతో రచయితగా అవకాశం కల్పించి అతడి ఎదుగుదలకు కారణమైన రామ్ గోపాల్ వర్మ సైతం తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించాడు. బయటికి చెప్పకపోయినా.. బాలీవుడ్లో మెజారిటీ జనాలు అనురాగ్ వైపే ఉన్నట్లు తెలుస్తోంది. పాయల్ కథానాయికగా ఎక్కడా తన ప్రతిభను చాటుకున్న దాఖలాలు లేకపోవడం, సోషల్ మీడియాలో ఈ మధ్య అదేపనిగా అటెన్షన్ కోసం ప్రయత్నిస్తుండటం.. టీవీ ఛానెల్లో అనురాగ్ మీద ఆరోపణలు చేసేపటుడు ఆమె హావభావాలు.. ఇవన్నీ గమనించిన నెటిజన్లు ఆమె ఆరోపణలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.