`ఈనాడు`కు కాసుల పంట – ఓటీటీలోకి రామోజీ !

ఈ టెక్ జమానాలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంలకు నానాటికీ ఆదరణ పెరుగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా రాకతో ఓటీటీకి ఉన్న ఆదరణ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ రంగంపై పూర్తి స్థాయిలో ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఈనాడు కూడా పూర్తి స్థాయిలో ఓటీటీ రంగంలో అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోందని టాక్ వస్తోంది. అపుడెపుడో అనుకోకుండా సినిమాల కాపీ రైట్స్ 99 ఏళ్లపాటు రాయించుకోవాలన్న రామోజీ ఆలోచన నేడు ఆయనకు ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతోంది. ఆనాడు చేసిన పని ఈనాడు రామోజీ రావుకు కలిసొచ్చింది. ఈటీవీ లో ప్రసారం చేసేందుకు సినిమాల రైట్స్ కొనుక్కున్న రామోజీరావుకు నేడు ఆ కాపీ రైట్స్ కాసులు కురిపించబోతున్నాయి.

వాస్తవానికి ఇప్పటికే రామోజీరావు పాక్షికంగా ఓటీటీలో అడుగుపెట్టారు. ఈనాడుకు చెందిన ఈటీవి విన్ లో ఈటీవీ రైట్స్ ఉన్న సినిమాలు స్ట్రీమ్ అవుతున్నాయి. దాదాపు తెలుగు ఓటీటీలన్నింటికీ ఈటీవీ విన్ పోటీనిస్తోంది. అయితే, భవిష్యత్తులో ఓటీటీ రంగంలో తిరుగులేకుండా ఎదిగేందుకు రామోజీ పావులు కదుపుతున్నారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన సినిమాలు ఈటీవీలో మాత్రమే ప్రసారమవుతాయి. ఇక, వాటితోపాటు ఈటీవీ ప్రారంభించిన కొత్తల్లో ఒకేసారి 99 ఏళ్ళపాటు లీజుకు తీసుకున్న వేలాది సినిమాల హక్కులు కూడా వేరేవరి దగ్గర లేవు. ఈ రెండు అంశాలు ఈనాడు లాంచ్ చేయబతోన్న ఓటీటీకి కొండంత బలం అని చెప్పవచ్చు. దీంతో, తమ ఓటీటీలో ఆ సినిమాలన్నీ స్ట్రీమింగ్ చేయాలని రామోజీరావు భావిస్తున్నారట. దీంతోపాటు, త్వరలో విడుదల కాబోతోన్న కొత్త సినిమాలు కూడా కొనేందుకు రామోజీరావు ప్లాన్ చేస్తున్నారట. ఓటీటీలో స్ట్రీమింగ్ తో పాటు ఈటీవీలో కూడా ప్రసారం అయ్యేలా సినిమాల్నీ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

ఏదైతేనేం..ఈనాడు అరంగేట్రంతో ఓటీటీ తెలుగు విస్తృతి పెరగడం ఖాయమని చెప్పవచ్చు.