ఇక ఆశ‌ల‌న్నీ ఆ సినిమా పైనే..

ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్ అన‌ద‌గ్గ క్రిస్టోఫ‌ర్ నోల‌న్ కొత్త సినిమా టెనెట్‌పై విడుద‌ల‌కు ముందు ఏ స్థాయి అంచ‌నాలున్నాయో తెలిసిందే. ఐతే ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమాల‌కు రోజులు బాలేని క‌రోనా టైంలో ధైర్యం చేసి గ‌త నెల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేశారు. కానీ ఈ ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. సినిమాకు మంచి టాక్ వ‌చ్చినా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించిన ఫ‌లితం రాలేదు.

నెల రోజుల్లో ఆ సినిమా 205 మిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే రాబ‌ట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 50 మిలియ‌న్ డాల‌ర్ల దాకా వ‌సూళ్లు కావాల్సిన ప‌రిస్థితి. మామూలు రోజుల్లో అయితే ఇప్ప‌టి వ‌సూళ్ల‌కు మూడు రెట్లు వ‌చ్చేవేమో. టెనెట్ రిజ‌ల్ట్ చూశాక ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరున్న సినిమాల విడుద‌ల విష‌యంలో వెనుకంజ వేసే ప‌రిస్థితి వ‌చ్చింది. బాక్సాఫీస్ ప‌రిస్థితి ఎప్పుడు మారుతుందా అన్న ఆందోళ‌న నెల‌కొంది.

అయినా స‌రే.. మ‌రో భారీ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అది జేమ్స్ బాండ్ సిరీస్‌లోని సినిమా కావ‌డం విశేషం. ఈ ఏడాది ప్ర‌థ‌మార్ధంలోనే రావాల్సిన బాండ్ మూవీ నో టైం టు డైను నవంబ‌రులో రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. తాజాగా ఒక పోస్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు. మ‌రి ఈ సినిమా అయినా వ‌ర‌ల్డ్ బాక్సాఫీస్‌కు ఊపు తెస్తుందా అని సినీ ప్రియులు చూస్తున్నారు. ఇది బాండ్ సిరీస్‌లో 25వ సినిమా.

2006లో ‘క్యాసినో రాయల్’తో బాండ్ అవ‌తారం ఎత్తి.. ఆ తర్వాత ‘క్వాంటమ్ ఆఫ్ సోలెస్’, ‘స్కై ఫాల్’, ‘స్పెక్టర్’ సినిమాల్లో బాండ్‌గా కనిపించిన డేనియ‌ల్ క్రెయిగ్‌కు ఆ పాత్ర‌లో ఇదే చివ‌రి సినిమా కావ‌చ్చు. ఎందుకంటే అత‌ను స్పెక్ట‌ర్‌తోనే బాండ్ సినిమాల‌కు గుడ్ బై చెప్పాల‌నుకున్నాడు. కానీ నిర్మాత‌ల బ‌ల‌వంతంతో ఇంకో సినిమా చేశాడు. నో టైం టు డై సినిమా కోసం క్రెయిగ్ దాదాపు రూ.600 కోట్లు పారితోషకంగా తీసుకున్నట్లు సమాచారం. ముందు ఈ చిత్రానికి ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ డానీ బోయెల్‌ను దర్శకుడిగా అనుకున్నారు కానీ.. ఆ తర్వాత అతడి స్థానంలోకి కేరీ జోజి వచ్చాడు. అత‌నే సినిమాను తెర‌కెక్కించాడు.