ట్విట్ట‌ర్లో జ‌న‌సేన పార్టీ రికార్డ్

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వం ఎదుర్కొన్న‌ప్ప‌టికీ.. దాన్నుంచి త్వ‌ర‌గానే కోలుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది జ‌న‌సేన పార్టీ. క‌రోనా విజృంభిస్తున్న వేళ ఏపీలో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాలు ప్ర‌శంస‌లందుకుంటున్నాయి.

ఎన్నిక‌ల‌తో సంబంధం లేకుండా సోష‌ల్ మీడియాలో కూడా జ‌న‌సేన మ‌ద్ద‌తుదారులు చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌రోనాపై అవ‌గాహ‌న పెంచ‌డానికి, సేవా కార్య‌క్ర‌మాల‌కు, పార్టీ విధానాల్ని జ‌నాల్లోకి తీసుకెళ్లేందుకు.. అలాగే అధికార పార్టీని ఎదుర్కొనేందుకు సోష‌ల్ మీడియానే వేదిక‌గా చేసుకుంటున్నారు. ట్విట్ట‌ర్లో జ‌న‌సేన పార్టీ ఫాలోవ‌ర్లు గ‌త కొన్ని నెల‌ల్లో బాగా పెరిగారు. అక్క‌డ ఆ పార్టీ అఫీషియ‌ల్ పేజీ ఓ రికార్డును కూడా కైవ‌సం చేసుకుంది.

ట్విట్ట‌ర్లో మిలియ‌న్ ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది జ‌న‌సేన పార్టీ. ఏపీ, తెలంగాణ‌ల్లోనే కాదు.. మొత్తంగా సౌత్ ఇండియాలో 1 మిలియ‌న్ ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకున్న తొలి పార్టీ జ‌న‌సేనే కావ‌డం విశేషం. ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు ట్విట్ట‌ర్లో 5.6 ల‌క్ష‌ల మంది దాకా ఫాలోవ‌ర్లున్నారు.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అని పేరున్న తెలుగుదేశం పార్టీ ఫాలోవ‌ర్లు 4 ల‌క్ష‌లే. జ‌న‌సేన ఫాలోవ‌ర్ల‌లో ఎక్కువ మంది యువ‌తే కావ‌డం.. వారిలో చాలామంది సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌టం వ‌ల్ల ఆ పార్టీకి ఇంత భారీగా ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్లున్నారు.

ట్విట్ట‌ర్లో రాజ‌కీయ‌, సామాజిక విష‌యాల గురించి మాత్ర‌మే మాట్లాడే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు 4 మిలియ‌న్ల దాకా ఫాలోవ‌ర్లున్నారు. వారిలో మెజారిటీ ఫాలోవ‌ర్ల‌ను ఇటు మ‌ళ్లించ‌గ‌లిగితే జ‌న‌సేన ఫాలోవ‌ర్ల సంఖ్య ఇంకా పెంచుకోవ‌చ్చు. ఐతే ఈ ఫాలోవ‌ర్ల‌ను ఓట‌ర్లుగా మార్చ‌డ‌మే జ‌న‌సేన ముందున్న క‌ర్త‌వ్యం.