బిగ్ బాస్ తొలి రోజే ట్విస్ట్

Bigg Boss

మొత్తానికి బిగ్ బాస్ నాలుగో సీజ‌న్ మొద‌లైపోయింది. కొన్ని రోజులుగా ప్ర‌చారంలో ఉన్న వాళ్లే ఈ షోలో కంటెస్టెంట్లుగా తేలారు. దీన్ని బ‌ట్టి బిగ్ బాస్ నిర్వాహ‌కులే ఉద్దేశ‌పూర్వ‌కంగా లీక్స్ ఇచ్చారేమో అనిపిస్తోంది. ఐతే ఇది ప్ర‌తి సీజ‌న్ ముంగిటా ఉండేదే.

ఆ సంగ‌త‌లా ఉంచితే గ‌త మూడు సీజ‌న్ల‌తో పోలిస్తే పార్టిసిపెంట్లు ఏమంత ఎగ్జైటింగ్‌గా క‌నిపించ‌ట్లేద‌న్న‌ది ముందు నుంచి వినిపిస్తున్న విమ‌ర్శ‌. షోలో పాల్గొంటున్న వారిలో బ‌య‌ట సూప‌ర్ పాపులారిటీ అయితే ఎవ‌రికీ లేదు. కాక‌పోతే నోయ‌ల్‌, క‌రాటే క‌ళ్యాణి, టీవీ9 దేవి, అమ్మ రాజ‌శేఖ‌ర్, మోనాల్ గజ్జ‌ర్ లాంటి వాళ్లు షోకు కావాల్సిన మ‌సాలా అందిస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. యూట్యూబ్ స్టార్ గంగ‌వ్వ‌ను షోలోకి తీసుకోవ‌డం భిన్న‌మైన ఎత్తుగ‌డే.

ఐతే పార్టిసిపెంట్ల జాబితా చూస్తే వాళ్ల‌ను చూసి షో ప‌ట్ల ఆస‌క్తి పెంచుకునే ప‌రిస్థితి అయితే లేదు. వాళ్ల‌కు సొంతంగా ఉన్న పాపులారిటీ త‌క్కువ‌. ఈ షోలో వాళ్లు త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుని పాపులారిటీ తెచ్చుకోవాలి. ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్ హౌస్‌లో వారి ప్ర‌వ‌ర్త‌న, ఎత్తుగ‌డ‌లు ఎలా ఉంటాయో చూడాలి. అదే స‌మ‌యంలో ర‌క‌ర‌కాల ఎత్తుగ‌డ‌లు, గేమ్‌లు, మ‌లుపుల‌తో షోను ఎగ్జైటింగ్‌గా మార్చాల్సిన బాధ్య‌త నిర్వాహ‌కుల మీదా ఉంది.

ఈ విష‌యంలో తొలి రోజు బాగానే ఆస‌క్తి రేకెత్తించ‌గ‌లిగారు. పార్టిసిపెంట్ల ప‌రిచ‌యం, నాగ్ హోస్టింగ్, గ్రాండియ‌ర్ ఆక‌ట్టుకున్నాయి. అలాగే తొమ్మిదవ‌, ప‌ద‌వ పార్టిసిపెంట్లుగా వ‌చ్చిన సయ్యద్ సోహైల్, అరియానా గ్లోరీల‌ను నేరుగా హౌస్‌లోకి పంప‌కుండా తొలి రోజే సీక్రెట్ రూమ్‌లోకి పంప‌డం ద్వారా నాగ్ గేమ్ మొద‌లుపెట్టాడు. ఈ ట్విస్టుతో మొద‌లైన గేమ్ సోమ‌వారం నుంచి ఎలా సాగుతుందో చూడాలి.