కర్ణాటకలో పట్టుబడ్డ నూతన్ నాయుడు…అరెస్ట్

విశాఖలోని పెందుర్తిలో శ్రీకాంత్ అనే దళిత యువకుడికి శిరో ముండనం ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సినీ నిర్మాత, నటుడు నూతన్ నాయుడు ఇంట్లో పనిమానేసిన శ్రీకాంత్ ఫోన్ దొంగతనం చేశాడంటూ నూతన్ తో పాటు అతడి కుటుంబసభ్యులు శ్రీకాంత్ పై దాడి చేసి గుండు కొట్టించడం సంచలనం రేపింది. నూతన్ నాయుడు నివాసంలో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీంతో, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నూతన్‌ నాయుడు భార్య మధుప్రియ సహా ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న నూతన్ నాయుడు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నూతన్ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టిన ఏపీ పోలీసులు తాజాగా శుక్రవారం నాడు అతడిని కర్ణాటకలోని ఉడిపిలో అరెస్టు చేశారు. ముంబైలో తలదాచుకునేందుకు నూతన్ వెళుతున్న క్రమంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నూతన్‌ నాయుడు పాత్ర ఉందని తేలిన తర్వాతే అతడిని అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు.

కాగా, శ్రీకాంత్ శిరోముండన ఘటన ఏపీలో సంచలనం రేపింది. ఘటన జరిగిన తర్వాత శ్రీకాంత్‌ను మంత్రి అవంతి శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌ పరామర్శించారు. శ్రీకాంత్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అవంతి చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీకాంత్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున లక్ష రూపాయల నగదు, సొంత ఇల్లు, ఔట్ ‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాంత్ కు వ్యక్తిగతంగా రూ.50 వేల నగదును ఎమ్మెల్యే అదీప్ రాజ్ అందజేశారు. శ్రీకాంత్ శిరోముండనం ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.