జీఎస్టీ నష్టపరిహారంపై నోరు మెదపని ఏపీ ?

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పలు రాష్ట్రాలు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతోన్న సంగతి తెలిసిందే. జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారం రూ.3 లక్షల కోట్లలో సెస్ తగ్గించి ఒక లక్షా 65 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తానడం పై విమర్శలు గుప్పిస్తున్నాయి. జీఎస్టీ చట్టంలో 14 శాతం వృద్ధి రేటు ప్రకారం రాష్ట్రాలకు చెల్లించాల్సిందేనని ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, ఛత్తీస్ గఢ్, తమిళనాడు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఎన్డీఏ మిత్రపక్షమైన ఏఐ డీఎంకే కూడా మోడీ సర్కార్ ను ప్రశ్నిస్తోంది. ఇక, విరుద్ధ భావాలున్న కేరళ, బెంగాల్ ముఖ్యమంత్రులు కూడా ఈ విషయంలో ఒక్కతాటిపైకి వచ్చి కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.

యాక్ట్ ఆఫ్ గాడ్, కరోనా పేర్లతో రూ.1.35 లక్షల కోట్ల నష్టపరిహారాన్ని ఎగ్గొట్టాలని కేంద్రం చూస్తోందని తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు కూడా విమర్శించారు. ఇక, జీఎస్టీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు.

ఈ వ్యవహారంపై పార్లమెంటులో పోరాడతామని, కోర్టుకు వెళతామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇంత జరుగుతోన్నప్పటికీ ఈ వ్యవహారంపై ఏపీ సీఎం జగన్, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

అయితే, అంశాలవారీగా బీజేపీకి మద్దతిస్తామని సీఎం జగన్ గతంలో అన్నారు. కానీ, జగన్ ను మాత్రం ఆ అంశం…ఈ అంశం అని లేకుండా అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీ నేతలు దుయ్యబడుతున్నారు. అయినప్పటికీ, కేంద్రంలో బీజేపీతో సఖ్యతగా ఉండటానికే వైసీపీ ప్రయత్నంచేస్తోంది.

ఇక, పార్లమెంటులో సీఏఏ వంటి బిల్లులకు మద్దతు తెలిపిన వైసీపీ…ఏపీ అసెంబ్లీలో దానికి వ్యతిరేకంగా తీర్మానించడం ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనమన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్ర విద్యుత్ చట్టంపై కూడా జగన్ మాట్లాడలేదు. కానీ, ఆ చట్టాన్ని తెలంగాణ వ్యతిరేకించింది. ఇక, కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన ఏపీ ఖజానా నిండేందుకు జీఎస్టీ నష్టపరిహారం ఉపయోగపడుతుంది.

కాబట్టి, కనీసం ఏపీకి రావాల్సిన డబ్బుల విషయంలోనైనా జగన్ మాట్లాడాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎటూ ప్రత్యేక హోదా, విభజన చట్టం వంటి వాటిపై వైసీపీ నేతలు మౌనంగా ఉంటున్నారని, జీఎస్టీ చట్టం రీత్యా రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు అడగడానికి అభ్యంతరం ఏమిటన్న వాదనలు వినిపిస్తున్నాయి.

చట్ట ప్రకారం రావాల్సిన డబ్బులు వస్తే రాష్ట్రానికి మేలే కదా…అయినా, మోడీకి జగన్ ఎందుకు భయపడుతున్నారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి, ఈ విమర్శలకు జగన్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.