అప్పుడు పవన్.. ఇప్పుడు చిరు.. భలే కలిసొచ్చిందే

ఆగస్టు, సెప్టెంబరు నెలలు మెగా అభిమానులకు చాలా ప్రత్యేకం. అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల పుట్టిన రోజులు ఈ నెలల్లోనే వస్తాయి. అది కూడా పది రోజుల వ్యవధిలోనే కావడం విశేషం. ఆగస్టు 22న చిరు పుట్టిన రోజు కాగా.. సెప్టెంబరు 2న పవన్ బర్త్ డే. ఈ రెండు రోజుల్లో మెగా అభిమానుల సందడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. మామూలుగానే ఇవి పండుగ రోజులు అంటే.. వీటికి మరో పెద్ద పండుగ తోడైతే ఎలా ఉంటుంది? శనివారం చిరు పుట్టిన రోజు నాడే.. తెలుగువారికి అత్యంత ఇష్టమైన పండుగల్లో ఒకటైన వినాయక చవితి వచ్చింది.

కరోనా వల్ల బయట సంబరాలు మరీ ఘనంగా ఏమీ లేవు కానీ.. ఎవరి ఇళ్లల్లో వాళ్లు వేడుకలు ఘనంగానే చేసుకుంటున్నారు. సోషల్ మీడియా సందడి గురించైతే చెప్పాల్సిన పని లేదు. ఓవైపు వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ.. మరోవైపు చిరుకు విషెస్ అందిస్తున్నారు.

ఇక వినాయక చవితి రోజు చిరు చాలా ఏళ్లుగా పాట ఒకటి ప్లే కాకుండా ఎప్పుడూ గడవదు. ‘జై చిరంజీవ’లోని జై జై గణేషా పాట ఎక్కడ చూసినా మార్మోగిపోతుంటుంది. ఈ రోజు చిరు పుట్టిన రోజు, వినాయక చవితి కలిసి రావడంతో సోషల్ మీడియాలో ఈ పాట హోరెత్తిపోతోంది. ఇంకో విశేషం ఏంటంటే.. గత ఏడాది వినాయక చవితి సెప్టెంబరు 2న వచ్చింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఇలా యాదృచ్ఛికంగా వరుగా రెండేళ్లు మెగా బ్రదర్స్ పుట్టిన రోజు నాడే వినాయక చవితి రావడం విశేషమే.

ఈ సంగతి తెలిసి మెగా అభిమానులు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ముచ్చటించుకుంటున్నారు. ఇక చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకలతో పాటు వినాయక చవితి సంబరాలు ఘనంగానే చేసుకున్నారు. ఆయన తనయుడు రామ్ చరణ్ తల్లిదండ్రులతో కలిసి దేవుడిని ప్రార్థిస్తున్న ఫొటో ఒకటి ట్విట్టర్లో షేర్ చేశాడు.