కేటీఆర్ డ్యామేజ్ వెనుక అసలు కథేంటి?

కేటీఆర్ డ్యామేజ్ వెనుక అసలు కథేంటి?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుత్రరత్నం కేటీఆర్ పై రియల్ దందా వ్యవహారం ఆ పార్టీని ఒక్కసారిగా కుదిపేసింది. అధినేత పుత్రరత్నంపై తీవ్రమైన ఆరోపణలు రావటంతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరైంది.కేటీఆర్ గురించి వ్యక్తిగతంగా తెలిసిన చాలామందిలోనూ ఇది షాకింగ్ గా ఉంది. ఎందుకంటే.. టీఆర్ఎస్ పార్టీలో వసూళ్ల ఆరోపణలకు దూరంగా ఉన్న వ్యక్తిగా కేటీఆర్ ను పార్టీ నేతలే ప్రస్తావిస్తారు. కేసీఆర్ కుటుంబంలోని మిగిలిన సభ్యులతో పోలిస్తే కేటీఆర్ పద్ధతిగా ఉంటారని.. అనవసరమైన విషయాల జోలికి వెళ్లరని.. డబ్బు యావ తక్కువేనని చెబుతారు.

అప్పుడప్పుడు.. డబ్బులు లేక.. కటకటలాడిపోతుంటారని కూడా చెబుతారు. అలాంటి వ్యక్తి నిజంగా కోరుకుంటే డబ్బు వరద పారుతుంది. కానీ.. డబ్బు మీద పెద్దగా ఆసక్తి చూపని కేటీఆర్ పై రియల్ ఆరోపణలు.. అదీ భారీ స్థాయిలో ఉండటం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. తమకు కనిపించే కేటీఆర్ లో రెండో కోణం ఉందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. విషయాన్ని లోతుగా పరిశీలిస్తే.. కేటీఆర్ ట్రాప్ లో చిక్కుకుపోయారని చెబుతున్నారు. తెలిసిన నేతకు సాయం చేద్దామన్న తలంపు తప్పితే.. ఈ వ్యవహారంలో డబ్బుతో ఆయనకు లింకు  లేదన్నది సారాంశం.

 మరి.. నిప్పు లేకుండా పొగ రాదు కదా అంటే.. దానికి ఓ కారణం ఉందంటున్నారు. టీఆర్ఎస్ లో అధిపత్య పోరు ఎప్పటి నుంచో నడుస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ తర్వాత స్థానం కోసం కేసీఆర్ కుటుంబసభ్యుల మధ్య భారీగా యుద్ధం నడుస్తుంది. పైకి అందరూ బాగానే కనిపించినా.. లోపల మాత్రం ఒకరంటే ఒకరికి ఏమాత్రం పొసగని పరిస్థితి. ఇదే కేటీఆర్ ను దెబ్బ తీసిందన్న వాదన ఒకటి ఆ పార్టీలో బలంగా ప్రచారం సాగుతోంది.

 కేసీఆర్ కుటుంబసభ్యుల్లో ఒక వ్యక్తి ప్లానింగ్ వల్లే కేటీఆర్ ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నది ఓ వాదన. కేటీఆర్ ను దెబ్బ తీసినా.. పార్టీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది కదా అన్నప్పుడు.. పార్టీలో తన కంటే ఎదుగుతున్న ప్రత్యర్థిని దెబ్బతీయటం.. ఆయనపై మచ్చ పడేలా చేయటం ద్వారా భవిష్యత్తులో కలిసి వస్తుందన్న దూరాలోచనతో పాటు.. కేటీఆర్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కూడా తాజా ఉదంతం దోహదం చేస్తుందన్న వాదన ఉంది. మొత్తానికి ఇంటి విబేధాలు పార్టీకి గుదిబండగా మారుతున్నాయన్న మాట. ఉద్యమ పార్టీలోని నేతలకి ఉద్యమం కంటే కూడా రాజకీయంపైనే అసలు ఆసక్తి. ఎంతైనా రాజకీయనాయకులు కదా.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు