జానారెడ్డి సరైనమాటే చెప్పారు కానీ...!

జానారెడ్డి సరైనమాటే చెప్పారు కానీ...!

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా..? అన్నట్టుగా సోనియా తలుచుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పడటం ఎంతసేపు? అని చెప్పవచ్చు. కానీ మన నాయకులు, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సమితి, టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ అంశం గురించి వ్యక్తులను వదిలిపెట్టి, అదుపులో లేని పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారు.మరి వారిది ఆత్మ వంచన చేసుకుంటున్నారో లేక  ప్రజలను అమాయకులు అనుకుంటున్నారో కానీ... తెలంగాణ అంశం గురించి అసలు విషయాన్ని దాచడానికే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఉద్యమ ప్రస్థానం, కేసీఆర్ వ్యక్తిత్వం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు...ఇవేవీ తెలంగాణ అంశాన్ని ప్రభావితం చేసే స్థితిలో లేవు. కేవలం కాంగ్రెస్ ప్రయోజనాలు మాత్రమే ఈ అంశాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

తెలంగాణ ఇస్తే మాకేంటి, ఇవ్వకపోతే మాకేంటి అన్నట్టుగా కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఎలా వ్యవహరిస్తే తమ ప్రయోజనాలకు భంగం కలగదో..అలా వ్యవహరించడానికి కాంగ్రెస్ మార్గాలను అన్వేషిస్తోంది. స్థూలంగా చెప్పాలంటే సోనియా గాంధీ అభిప్రాయాన్ని, సోనియా గాంధీ అభిప్రాయాన్ని  ప్రభావితం చేసే వారిపై తెలంగాణ అంశం ఆధారపడి ఉంది. ఈ విషయాన్ని సూటిగా చెప్పారు జానారెడ్డి. సోనియా తలచుకుంటే రాష్ట్ర విభజన జరుగుతుంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. పార్లమెంటు, శాసనసభ, తీర్మాణాలు, కమిటీలు ఆమె నిర్ణయం ముందు ఎందుకూ కొరగావని జానా స్పస్టం చేసినట్లు అయ్యింది ఈ మాటతో. ఇంత వరకూ జానా సూటిగానే మాట్లాడారు అనుకున్నా... ఎప్పటికైనా తెలంగాణ ఇవ్వక తప్పదు అని ఆయన అన్నారు. "ఎప్పటికైనా...' అని అంటే మళ్లీ ఇది ఆత్మవంచన చేసుకునే మాటేనేమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు