వర్మ బుడగ పేలిపోయింది

రామ్ గోపాల్ వర్మ సినిమాల క్వాలిటీ గురించి మాట్లాడుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఒక సినిమా చూసి ఇదే వర్మకిదే అత్యంత పతనం.. దీనికి మించి దిగజారడం కష్టం అనుకోవడం.. మళ్లీ తర్వాతి సినిమా చూసి అభిప్రాయం మార్చుకోవడం మామూలైపోయింది. సినిమా సినిమాకూ అలా తన స్థాయిని తగ్గించుకుంటూనే ఉన్నాడు. నిండా మునిగాక చలేంటి అన్నట్లుగా ఉంటోంది ఆయన వ్యవహారం. లాక్ డౌన్ టైంలో అందరూ కెమెరా పక్కన పెట్టేసి కూర్చుంటే ఆయన మాత్రం హీరోయిన్ల అందాల్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. క్లైమాక్స్, నేక్డ్, థ్రిల్లర్ అంటూ వరుసగా కళాఖండాలు వదులుతున్నాడు వర్మ. పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించడం వల్ల తొలి సినిమా మీద కాస్త ఆసక్తి కనిపించింది జనాల్లో.

టికెట్ రేటు వంద పెట్టి ఆన్ లైన్లో చూసే అవకాశం కల్పిస్తే కుర్రాళ్లు బాగానే ఎగబడ్డారు. దీని ద్వారా వర్మకు కొన్ని కోట్లొచ్చాయి. అదెలాంటి సినిమా అన్నది పక్కన పెడితే.. ఇలా పే పర్ వ్యూ పద్ధతిలో సినిమాను రిలీజ్ చేయడం అనే ఐడియా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ విషయంలో మాత్రం వర్మ అందరిలో ఆలోచన రేకెత్తించాడు. కానీ ఈ ఐడియా ఆయన సినిమాలకు తర్వాత తర్వాత మాత్రం పని చేయడం మానేసింది. ఈ మధ్య ‘పవర్ స్టార్’ సినిమా ఇలాగే రిలీజ్ చేస్తే మినిమం రెస్పాన్స్ లేకపోయింది.

తాజాగా ‘థ్రిల్లర్’ను ఇలా విడుదల చేస్తే దానికి కూడా స్పందన అంతంతమాత్రమే అని తెలుస్తోంది. మీడియా వాళ్లు వర్మ తీసే ఈ నాసిరకం సినిమాల గురించి వార్తలు రాయడం, రివ్యూలివ్వడం కూడా మానేశారు. వర్మ అలుపెరగకుండా ట్వీట్లు వేస్తున్నాడు కానీ.. సోషల్ మీడియాలో కూడా ‘థ్రిల్లర్’ గురించి చర్చే లేకపోయింది. అప్సరా రాణి అందాలు చూద్దామని కొద్ది మంది సినిమా చూసే ప్రయత్నం చేసి ఉంటారు కానీ.. ఇంకెవ్వరికీ దీని మీద ఆసక్తి కనిపించడం లేదు. వర్మ నుంచి రాబోయే ‘మర్డర్’, ‘కరోనా వైరస్’ సినిమాల్లో ఆ యాంగిల్ కూడా లేదు కాబట్టి వాటిని జనాలు అసలే పట్టించుకోకపోవచ్చు.