లోక్ సభ సభ్యులు రాజ్యసభలో.. రాజ్యసభ ఎంపీలు లోక్ సభలో?

వినేందుకు విచిత్రంగా అనిపిస్తుందా. కరోనా పుణ్యమా అని ఇప్పుడు ఇలాంటి సిత్రమైన సీన్ భారత పార్లమెంటులో చోటు చేసుకోనుంది సుదీర్ఘకాలం పాటు సాగే కరోనాతో కలిసి సాగాల్సిన అవసరాన్ని అందరూ గుర్తిస్తున్నారు.

దీంతో.. వర్షాకాల సమావేశాలకు పార్లమెంటు సిద్ధమవుతుంది. నిండుగా కనిపించే సభను ఇప్పటిలా మాదిరి.. తొలిసారి కొత్త విధానంలో తీర్చిదిద్దేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. కరోనా వేళ.. తప్పనిసరిగా పాటించాల్సిన భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వినూత్నంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో సరికొత్తగా చేస్తున్న ఏర్పాట్లు విన్నంతనే ఆశ్చర్యపోయేలా ఉన్నాయని చెబుతున్నారు.

ఇప్పటివరకు ఒకేసారి అటు లోక్ సభ.. రాజ్యసభ సమావేశాలు జరుగుతుంటాయి. అందుకు భిన్నంగా ఈసారి మాత్రం ఒక రోజు లోక్ సభ .. మరోరోజు రాజ్యసభ సభ నిర్వహించనున్నారు. అంతేకాదు.. లోక్ సభ జరిగే సమయంలో ఆ ఎంపీల్ని రాజ్యసభలోనూ కూర్చోబెట్టనున్నారు.అదే సమయంలో రాజ్యసభను నిర్వహించే సమయంలో అక్కడి సభ్యుల్ని లోక్ సభలో కూర్చోబెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అప్పుడు మాత్రమే భౌతిక దూరాన్నిపాటించేలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.

మరి రెండు సభల్లో కూర్చుంటే.. సభ్యులకు ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందన్న సందేహం అక్కర్లేదంటున్నారు. ఎందుకంటే.. తొలిసారి సభా కార్యకలాపాలు అందరికి కనిపించేలా ఒక్కో సభలో 85 అంగుళాల నాలుగు తెరల్ని.. గ్యాలరీల్లో 40 అంగుళాల ఆరు స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. గ్యాలరీలో కూర్చున్న సభ్యలు సభా కార్యకలాపాల్లో పాలు పంచుకునేలా ప్రతి సీటుకూ మైక్ తోపాటు.. స్విచ్ లను ఏర్పాటు చేస్తున్నారు.

అంతేకాదు.. ఏసభలో కూర్చున్నా.. పక్క సభలోని కార్యకలాపాలు ప్రత్యక్షంగా కనిపించేలా కేబుళ్లు ఏర్పాటు చేయటంతో పాటు.. ఏసీల ద్వారా అల్ట్రా వయోలెట్ జెర్మిసిడల్ ఇర్రిడియేషన్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. దీంతో.. గాలి ద్వారా సంక్రమించే బ్యాక్టీరియా.. వైరస్ లను అడ్డుకునే అవకాశం ఉంది. అంతేకాదు.. సభ మధ్యలో కూర్చునే సచివాలయ సిబ్బంది మిగిలిన సభ్యులకు చేరువుగా వెళ్లకుండా వారి చుట్టూ పాలి కార్బొనేట్ తెరతో అడ్డుగోడ ఏర్పాటు చేస్తారు.

భౌతిక దూరాన్ని అనుసరించి రాజ్యసభలో 60 మందిని.. గ్యాలరీల్లో 51మంది కూర్చోబెట్టనున్నారు. మిగిలిన 132 మంది సభ్యుల్ని లోక్ సభలో సర్దు బాటు చేయనున్నారు. లోక్ సభలోనూ ఇదు తరహాలో కూర్చోబెట్టనున్నారు. ఇలా ఉభయ సభల సభ్యులు.. ఉభయ సభల్లో కూర్చొని సభల్లో కూర్చునే ఆసక్తికర సన్నివేశం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఇప్పటివరకు అనుకున్న సమాచారం ప్రకారం పార్లమెంటు సమావేశాలు ఆగస్టు చివరి వారంలో కానీ.. సెప్టెంబరు మొదటి వారంలో కానీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.