బాబు పై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

2019 ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకొని మరీ విజయం సాధించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. పీవీపీపై విజ‌యం త‌ర్వాత నాని వైఖ‌రిలో పూర్తి మార్పు వ‌చ్చింద‌ని టీడీపీ నేతలు అంటున్నారు. మరోవైపు, పార్టీ వైఖరి త‌న‌కు న‌చ్చడం లేద‌ని సోషల్ మీడియా వేదికగా టీడీపీపై కేశినేని నాని విమర్శలలలు గుప్పిస్తున్నారు.

పార్టీలో గెలిచిన నాయ‌కుల కంటే కూడా ఓడిన నేత‌ల‌కే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం, ప‌ద‌వులు క‌ట్టబెడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్నల‌పై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇలా, స్వపక్షంలోనే విపక్షంలా మారిన నాని…..తాజాగా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీడియా సమావేశాలతో, పేపర్ స్టేట్ మెంట్ల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, అమరావతి రాజధానిగా ఉండాలంటే టీడీపీ నేతలంతా కలిసికట్టుగా పని చేసి 2024లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబునుద్దేశించి నాని చేసిన ట్వీట్ పెను దుమారం రేపుతోంది.

3 రాజధానులపై ప్రజాతీర్పు కోరేందుకు అసెంబ్లీని రద్దు చేయాలన్న తన సవాల్‌పై సీఎం జగన్ స్పందించకుండా పారిపోయారని చంద్రబాబు విమర్శించారు. 3 రాజధానులపై ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్‌ విధించినా ఫలితం లేకపోవడంతో….రాజధానిగా అమరావతి ఎందుకు అవసరమో రెండు రోజులకోసారి ప్రజలకు నివేదికల రూపంలో వివరిస్తానని అన్నారు.

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రభుత్వం ప్రకటిస్తే పదవులను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబునుద్దేశించి కేశినేని నాని సంచలన ట్వీట్ చేశారు.”మన కలలు మనమే సాకారం చేసుకోవాలి మన కలలు ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం అమరావతి @ncbn ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్న కల అది సాకారం అవ్వాలంటే 2024 లో @JaiTDP అధికారంలోకి రావాలి ఆ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలి మీడియా సమావేశాల వల్ల పేపర్ స్టేట్మెంట్స్ వల్ల ప్రయోజనం లేదు” అని నాని చేసిన ట్వీట్ పెను దుమారం రేపుతోంది.

వాస్తవానికి వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు ఇచ్చిన 48 గంటల డెడ్ లైన్ కాన్సెప్ట్ పై విమర్శలు వస్తున్నాయి. ఇక ‘2 రోజులోసారి ప్రజలకు నివేదికలు’ అనే కాన్సెప్ట్ పైనా…సొంతపార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారట. 3 రాజధానులపై అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేందుకు ఇది సరైన విధానం కాదన్న భావనలో ఉన్నారట.

ఇక, గతంలోనూ ఇటువంటి ప్రెస్ మీట్లు, మీడియా సమావేశాల వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదన్న ఫీలింగ్ చాలామందిలో ఉందట. ఇపుడు కూడా చంద్రబాబు అదే తరహాలో మీడియా సమావేశాలు, ప్రకటనలు, నివేదికలు అంటే పెద్దగా ఉఫయోగం ఉండక పోవచ్చని అనుకుంటున్నారట. ఇదే విషయాన్ని కేశినేని నాని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయట. ప్రెస్ మీట్లు, నివేదికలు వద్దంటూ చంద్రబాబుకు నాని ఇచ్చిన సలహాను ఆయన పాటిస్తారా అన్న చర్చ జరుగుతోందట. మరి, నాని చేసిన కామెంట్లపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.