మంత్రి స్టేట్మెంట్.. కరోనా చికిత్స ఖర్చు వెయ్యే

Eetela Rajendra

కొంచెం ఆలస్యంగా అయినా సరే.. తెలంగాణలో కరోనా చికిత్స పేరుతో బాధితుల్ని దోచేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులపై కొరడా ఝులిపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే అయినకాడికి ఫీజులు దండుకుంటున్న డెక్కన్ హాస్పిటల్ కరోనా చికిత్స చేయకుండా లైసెన్స్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

తర్వాతి రోజు జూబ్లీ హిల్స్‌లోని విరించి ఆసుపత్రి మీదా ఇలాగే వేటు వేసింది ప్రభుత్వం. కార్పొరేట్ ఆసుపత్రులకు ఇంకా బలమైన హెచ్చరిక జారీ చేసే ఉద్దేశంతో ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు.

ఈ సందర్భంగా మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై ఆయన మండిపడ్డారు. తాము చెప్పిన విధంగా కాకుండా కొన్ని ఆస్పత్రులు ఇష్టానుసారం డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు తమకు వందల, వేల ఫిర్యాదులు వస్తున్నాయని.. ఆస్పత్రికి పోగానే రూ.2లక్షలు డిపాజిట్‌ చేయిండి అనడం.. చికిత్స జరగాలంటే రోజుకు రూ.లక్ష కట్టాలనడం.. 15 రోజులు ఉంటే రూ.15 లక్షలు కట్టండి అంటూ వేధింపులకు పాల్పడటం వంటి ఫిర్యాదులు అందాయని.. మనిషి చనిపోతే మృతదేహాన్ని అప్పగించడానికి రూ.4 లక్షలు కట్టాలని వేధించే పద్ధతి మానవ సమాజానికే ఓ కళంకంగా మారిపోయిందని ఆయనన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నియమించిన కమిటీలు అన్నీ పరిశీలిస్తున్నాయని.. పద్ధతి మర్చుకోని ఆసుపత్రులకు అనుమతులు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.

కరోనాకు ఇస్తున్న మందులు 15 పైసల ట్యాబ్లెట్లు, పది రూపాయల ఇంజెక్షన్లే తప్ప వేలాది ఖరీదు చేసే ఇంజెక్షన్లు లేవని.. నిన్న నిపుణుల కమిటీ చెప్పిన దాని ప్రకారం అసలు ఈ చికిత్స అంతా కలిపితే రూ.1000లకు మించదంటున్నారని.. పెద్ద పెద్ద ఇంజెక్షన్లు, పెద్ద పెద్ద దవాఖానాలు, వెంటిలేటర్ల వరకు జనం ఆలోచిస్తున్నారని.. అంత అవసరం లేదని మంత్రి అన్నారు. సకాలంలో చికిత్సతో పాటు ఆక్సిజన్‌ అవసరమని… ఆక్సిజన్‌ కూడా 10 రోజుల పాటు ఒక పేషెంట్‌కు పెడితే.. రోజుకో సిలిండర్‌వాడినా కూడా 10 రోజుల కాలంలో ఒక పేషెంట్‌పై రూ.2500 మాత్రమే ఖర్చవుతుందని.. ఇదీ అసలు చికిత్స అని.. కార్పొరేట్‌ ఆస్పత్రి అయినా, గాంధీ ఆస్పత్రి అయినా.. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీ అయినా కరోనాకు ఇచ్చే మందులివేనని ఆయన స్పష్టం చేశారు.ప్రజలు బెంబేలెత్తిపోయి ప్రైవేటు ఆస్పత్రులకు పోనక్కర్లేదని.. అంటుకోగానే చంపే శక్తి ఈ వైరస్‌కు లేదని ఆయన పేర్కొన్నారు.