నలంద కిశోర్ ది పోలీసు హత్యే: రఘురామకృష్ణంరాజు

Nalanda Kishore

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు, సన్నిహితుడు నలంద కిశోర్‌ మృతి వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై నలంద కిశోర్ ను అరెస్టు చేసి వదిలేశారని, అప్పటి నుంచి అతడి ఆరోగ్యం బాగోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు.

ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న నలంద కిశోర్….ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కిషోర్ గుండెపోటుతో మృతిచెందాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. నలంద కిషోర్‌కు కరోనా టెస్టుల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో నలంద కిశోర్ మరణంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

నలంద కిషోర్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని, అనారోగ్యంతో ఉన్న నలంద కిశోర్ ను కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కర్నూలుకు తీసుకు వెళ్లారని వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికీ పోలీసు హత్యగానే భావించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషోర్ పెట్టిన పోస్టుల్లో ఎవరి పేరు లేకపోయినా కక్ష పూరితంగా అతడిని అరెస్ట్ చేశారని విమర్శించారు.

కర్నూలులో కరోనా పాజిటివ్ పేషంట్లను పెట్టే సెంటర్‍లో కిషోర్‍ను పెట్టారని, అందుకే కిశోర్‍కు కూడా కరోనా వచ్చినట్లు ఉందని రఘు రామ కృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ఇది పోలీసు హత్యగానే భావించాలని, కిషోర్ పెట్టిన పోస్టుల్లో ఎవరి పేరు లేకపోయినా అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారని, మాట్లాడే హక్కుతోపాటు జీవించే హక్కునూ హరిస్తున్నారంటూ ప్రభుత్వ తీరును విమర్శించారు. మన ప్రభుత్వంలో ఇలాంటి వేధింపులు ఎందుకని, ఇప్పటికైనా ప్రజల మనోభావాలను తెలుసుకోవాలంటూ సీఎం జగన్ ను ఉద్దేశిచి వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలతోనే మనం ఎల్లకాలం మనుగడ సాధించలేమని, దయచేసి ముఖ్యమంత్రిగారు అర్థం చేసుకోవాలని అన్నారు.

ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని, కుటుంబాల శాపాలు ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. నిన్న సుప్రీంలో జరిగింది మా మనస్సాక్షిలో కన్పించలేదని, నిమ్మగడ్డను కొనసాగించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కన్పించడం లేదని రఘురామకృష్ణంరాజు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

నిన్న నిమ్మగడ్డ వ్యవహారంలోనూ జగన్ సర్కార్ పై రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ వ్యవహారంతో పాటు మిగతా విషయాల్లో ప్రభుత్వ వైఖరి మారకుంటే ఆర్టికల్ 356 ఎంతో దూరంలో లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నిమ్మగడ్డ లాగే తన విషయంలోనూ త్వరలోనే వాస్తవాలు బయటకి వస్తాయని, జగన్ చెప్పుడు మాటలు వింటున్నారని వ్యాఖ్యానించారు. ఇపుడు తాజాగా నలంద కిశోర్ వ్యవహారంలోనూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. రోజురోజుకీ జగన్ సర్కార్ పై రఘురామకృష్ణంరాజు విమర్శల తీవ్రత పెరుగుతోంది. మరి, రఘురామకృష్ణంరాజుపై వైసీపీ అధిష్టానం, సీఎం జగన్ ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.