జగన్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన శిరోముండన ఘటన

అధికారం చేతిలో ఉంది కదా అని చెలరేగిపోయే వారిని అదుపులోకి పెట్టుకోకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యేలా చేసిందని చెప్పాలి తాజా శిరోముండన ఉదంతం. అంతేకాదు.. పార్టీ నేతలు కొందరు చెలరేగిపోతున్న తీరు కళ్లకు కట్టేలా తాజా ఉదంతం మారింది. మంగళవారం ఏపీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దళిత యువకుడిపై జరిగిన దౌర్జన్యంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే?

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెదుళ్లపల్లికి చెందిన వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడ్ని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అనుచరుడి ఫిర్యాదు ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన చోటా నేత అయినా.. పోలీసులు ప్రదర్శించిన ఓవరాక్షన్ కారణంగా దారుణ పరిణామం చోటుచేసుకుంది. అధికార పార్టీ నేత అనుచరుడు ఫిర్యాదు కావటంతో వెనుకా ముందు చూసుకోకుండా సదరు వ్యక్తిని తీవ్రంగా కొట్టటమే కాదు.. అతడికి శిరోముండనం చేశారు.

అనంతరం తీవ్రగాయాలపాలైన అతడ్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ వరప్రసాద్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఏమిటన్నది చూస్తే..ఇసుక లారీల్ని అడ్డుకున్నందుకే తనపై దాడి చేసినట్లుగా బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇసుక లారీల్నిఆపిన సమయంలో స్థానిక మునికూడలి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ నేత కవల క్రిష్ణమూర్తి కారుతో వచ్చి ఢీ కొట్టాడని వరప్రసాద్ ఆరోపిస్తున్నాడు.

అనంతరం బాధితుడి ఇంటికి వెళ్లిన కోరుకొండ డీఎస్సీ విచారణ చేపట్టారు. జరిగిన ఉదంతంపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇక..మాజీ ఎంపీ హర్షకుమార్ జరిగిన ఉదంతంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులకు తెలిసే ఈ ఘటన జరిగిందన్న ఆయన.. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలోని ఎస్సీలను అణిచివేయాలనే ప్రభుత్వం చూస్తుందన్న ఆగ్రహం వ్యక్తం చేసిన హర్షకుమార్.. పెయిడ్ బ్యాచులకు ప్రభుత్వం డబ్బులిచ్చి పోషిస్తుందన్నారు. పార్టీ ముసుగులు వదిలేసి అందరూ ఈ ఘటనను ఖండించాలని.. ఇరవై నాలుగు గంటల్లో శిరోముండనం వెనుక ఉన్న వారందరిపై చర్యలు తీసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ.. తమ మాటను పట్టించుకోకుండా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దళిత బిడ్డకు శిరోముండనం చేయిస్తారా? దీని వెనకున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. పోలీసుల్ని కఠినంగా శిక్షించాలని అనిత మండిపడ్డారు.

శిరోముండన ఘటనలో బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనను ప్రేరేపించిన అధికారపక్ష నేతల్ని కూడా బాధ్యుల్ని చేయాలని వారిపై ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శిరోముండనం ఉదంతం తీవ్ర సంచలనంగా మారటం.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు.

అసలేం జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న సీఎం జగన్.. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధ్యులైన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ విచారణ జరిపించాలని.. ఈ ఘటనకు కారణమైన ఎస్సై.. ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు విధించినట్లుగా సీఎం కార్యాలయం పేర్కొంది. అధికారులపై చట్టప్రాకరం చర్యలు ఉంటాయని డీజీపీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతం ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి వ్యవహారశైలిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.