కరోనా వేళ.. కేసీఆర్ ఏం చేయాలో చెప్పిన గవర్నర్

టైం కాకపోతే ఏమిటి చెప్పండి? దేశంలోనే మొనగాడు నేతగా అభివర్ణించే ప్రధాని మోడీకే సలహాలు ఇచ్చే మాస్టర్ మైండ్ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన్ను అభిమానించే వారు అభివర్ణిస్తుంటారు. దీనికి తగ్గట్లే కేసీఆర్ అప్పుడప్పుడు పెట్టే ప్రెస్ మీట్లలో తనకున్న తెలివిని ప్రదర్శిస్తారు. వివిధ అంశాల్లో కేంద్రం ఏం చేస్తే బాగుంటుందో చెప్పి.. ఈ చిన్న ఆలోచన కూడా ఎందుకు చేయరో అన్న ఆవేదనను అప్పుడప్పుడు వ్యక్తం చేస్తుంటారు. పెద్దనోట్ల రద్దు.. లాక్ డౌన్ లాంటి ఎపిసోడ్లలో ప్రధాని మోడీకి భారీ ఎత్తున సలహాలు.. సూచనలు ఇచ్చే ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు మంచి పేరుంది.

అలాంటి ఆయనకు కరోనా వేళలో తెలంగాణ రాష్ట్రంలో ఏమేం చేయాలన్న విషయానికి సంబంధించిన సలహాలు.. సూచనల్ని చేశారు గవర్నర్ తమిళ సై. కరోనా ఎపిసోడ్ లో తెలంగాణ ప్రభుత్వం తప్పులు చేస్తుందని.. దీని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లుగా విమర్శల్ని ఎదుర్కొంటున్నారు.

పాలనను వదిలేసి.. ఫాంహౌస్ కే పరిమితమవుతున్నట్లుగా విమర్శల్ని ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అదే సమయంలో తెలంగాణ గవర్నర్ గా వ్యవహరిస్తున్న తమిళ సై మాత్రం అందుకు భిన్నంగా నిమ్ష్ కు వెళ్లి కరోనా వారియర్స్ కు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఒకదశలో గాంధీకి కూడా వెళ్లాలని భావించినా.. అధికారులు వారించటంతో ఆగిపోయారు.

తాజాగా తనను కలిసిన సీఎం కేసీఆర్ కు కరోనా టైంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి వరుస పెట్టి సలహాలు.. సూచనలు చేసినట్లుగా చెబుతున్నారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కరోనా పరీక్షల కోసం రోగులు ఆసుపత్రులు.. ల్యాబుల చుట్టూ తిరిగితే.. మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని.. టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయాలన్నారు.

అనుమానం ఉన్న వారు ఫోన్ చేసిన వెంటనే.. ఆరోగ్య కార్యకర్తలు కానీ ఇతర వైద్య సిబ్బంది కానీ ఇంటికే వెళ్లి పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రుల సహకారం తీసుకోవాలని.. అందుకు ప్రైవేటు ఆసుపత్రులతో ఒక సమన్వయ కమిటీ వేయాలన్నారు. ఈ కమిటీతోనే ప్రైవేటు ఆసుపత్రుల ఫీజుల నియంత్రణ కూడా సాధ్యమవుతుందని చెప్పారు. కరోనా చికిత్సలో ఫ్లాస్మాథెరిపీ కీలక భూమిక పోషిస్తుందని.. ప్రతి ఆసుపత్రిలో ఫ్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేయాలన్నారు. ప్లాస్మా దాతలకు ప్రోత్సాహాకాలు అందించాలని సలహా ఇచ్చారు.

ఇలా సలహాలు.. సూచనలు ఇవ్వటమే కాదు.. తాను చొరవ తీసుకొని కేంద్రమంత్రితో మాట్లాడటం కారణంగా తెలంగాణకు జరిగిన లాభాన్నిఆమె ముఖ్యమంత్రికి చెప్పటం గమనార్హం. తాను చొరవ తీసుకొని కేంద్ర కార్మిక మంత్రితో మాట్లాడిన నేపథ్యంలో ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రిలో ర్యాపిడ్ పరీక్షల యంత్రాన్ని ఏర్పాటు చేయాలన్న దానికి సానుకూలంగా స్పందించారని చెప్పారు. నిజానికి ఇలాంటివన్నీ చొరవ తీసుకొని చేయాల్సింది ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకు భిన్నంగా తాను చేశానని చెప్పటం ద్వారా.. కసీఆర్ కు తాను ఇవ్వాల్సిన సందేశాన్ని గవర్నర్ ఇచ్చినట్లుగా చెప్పక తప్పదు. మొత్తానికి ప్రధాని మోడీకే సలహాలు ఇచ్చే సత్తా ఉన్న కేసీఆర్..తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఏం చేయాలో సూచనలు తీసుకోవటాన్ని ఎలా ఫీల్ అయ్యారో?