గుప్త నిధుల మాటకు ఫైర్ అయిన నిజాం వారసులు

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. తరచూ ఆయన చేసే వ్యాఖ్యలు ఇట్టే ప్రజల్లోకి వెళ్లటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చకు తెర తీస్తుంటాయి. రోటీన్ కు భిన్నంగా ఉండటమే కాదు.. అప్పటివరకూ ఎవరూ చూపించని కొత్తయాంగిల్ ను తన విమర్శల్లోనూ.. ఆరోపణల్లోనూ ప్రదర్శిస్తుంటారు. తెలంగాణ సచివాలయం కూల్చివేతను వ్యతిరేకించినోళ్లు చాలామందే ఉన్నా.. రేవంత్ రెడ్డి మాత్రం మిగిలిన వారికి భిన్నంగా సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేశారు.

తెలంగాణ సచివాలయంలోని జీ బ్లాక్ కింద గుప్తనిధులు ఉన్నాయంటూ ఆయన పేర్కొన్నారు. నిజాం నిర్మించిన జీ బ్లాక్ భవనం కింద నేలమాళిగలు ఉన్నాయని పురావస్తు శాఖ గుర్తించిందని.. వాటి కోసమే తాజా కూల్చివేతలుగా పేర్కొని సంచలనంగా మారారు. ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారటమే కాదు.. కొత్త సందేహాన్ని కలిగేలా చేశాయి. ఇలాంటివేళలో నిజాం వారసులు రంగంలోకి దిగారు. సీన్లోకి వచ్చారు.

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనమడు నవాజ్ నజఫ్ అలీ ఖాన్ ఈ వివాదంపై స్పందించారు. ముస్లిం రాజులు ఎవరూ కూడా నేలమాళిగల్లో బంగారాన్ని దాచే అలవాటు ఉండదన్నారు. భూమి తప్పించి ఆస్తులు కూడబెట్టటం.. నేలమాళిగల్లో సంపదను ఉంచటం పాపంగా ఖురాన్ లో స్పష్టంగా రాసి ఉంటుందని చెప్పారు. వాస్తవానికి తమ తాత విడిది కోసం ఆ భవనాన్ని నిర్మించారని.. అయితే.. అక్కడకు వెళ్లిన తొలి రోజునే తొండ ఎదురుకావటంతో అపశకునంగా భావించి.. మళ్లీ అక్కడకు ఎప్పుడూ వెళ్లలేదన్నారు.

అయినా.. గుప్త నిధులు రహస్య ప్రాంతాల్లో దాచుతారే తప్పించి.. నలుగురు తిరిగే చోట ఎందుకు ఉంచుతారన్న ప్రశ్నను సంధిస్తున్నారు. కాలక్రమంలో ఆ భవనం సచివాలయంగా మారిందన్నారు. గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారం తప్పుగా తేల్చారు.ఫైర్ బ్రాండ్ కు పంచ్ పడేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై రేవంత్ ఎలా రియాక్టు అవుతారో?