బ‌ద్రి విడుద‌ల రోజు పూరి నీరుగారిపోయాడా?

బ‌ద్రి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఒక కొత్త ఇమేజ్ తీసుకొచ్చి అత‌ణ్ని పవ‌ర్ స్టార్‌ను చేసిన సినిమా. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టింది ఈ చిత్రంతోనే. అప్ప‌ట్లో దాదాపు 45 కేంద్రాల్లో ఈ చిత్రం శ‌త దినోత్స‌వం జ‌రుపుకుంది. ప‌వ‌న్‌కు తొలిప్రేమ త‌ర్వాత అదే పెద్ద హిట్. బ‌ద్రితో అరంగేట్రం చేసిన పూరి త‌ర్వాత ఏ స్థాయికి వెళ్లాడో తెలిసిందే.

ఐతే ఆ సినిమా రిలీజ్ రోజు మాత్రం పూరి తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయాడ‌ట‌. త‌న కెరీర్ గురించి ఆందోళ‌న చెందాడ‌ట‌. కార‌ణం.. బ‌ద్రి సినిమాకు వ‌చ్చిన నెగెటివ్ టాకే. ఆ రోజు పూరి ఎంత‌గా నిరాశ చెందాడో.. ఆయ‌న మిత్రుడు, సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె తాజాగా ట్విట్ట‌ర్లో వెల్ల‌డించాడు. బ‌ద్రికి 20 ఏళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో ఆ సినిమా విడుద‌ల రోజు పూరి అనుభ‌వాల గురించి ర‌ఘు ట్వీట్ చేశాడు.

బ‌ద్రి మార్నింగ్ షో కోసం హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేట‌ర్‌కు వెళ్లామ‌ని.. అక్క‌డ క‌ళ్యాణ్ అభిమానుల హంగామా మామూలుగా లేద‌ని.. కానీ షో ముగిసే స‌మ‌యానికి వాతావ‌ర‌ణం మారిపోయింద‌ని.. ఏదో తేడా కొడుతోంద‌నిపించిందని ర‌ఘు గుర్తు చేసుకున్నాడు.

డిస్ట్రిబ్యూట‌ర్లంద‌రూ సినిమా పోయింద‌నే అన్నార‌ని.. నిర్మాత త్రివిక్ర‌మ‌రావు ఫోన్ కూడా తీయ‌ట్లేద‌ని చెబుతూ.. సినిమా పోయింద‌నే నిరాశ‌తో పూరి మాట్లాడాడ‌ని.. కానీ త‌ర్వాతి రోజు అద్భుతం జ‌రిగింద‌ని.. ఒక్క‌సారిగా సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ మొద‌లైంద‌ని.. హౌస్ ఫుల్స్ ప‌డ్డాయ‌ని.. నిర్మాత త్రివిక్ర‌మ‌రావు రిపోర్ట్స్ ప‌ట్టుకుని పూరి ద‌గ్గ‌రికి వ‌చ్చి ఆనందంతో ఆయ‌న్ని పైకెత్తుకున్నంత ప‌ని చేశార‌ని.. త‌ర్వాత ప‌వ‌న్‌తో పాటు చిరంజీవి కూడా పూరికి ఫోన్ చేసి అభినందించార‌ని.. అప్పుడు జ‌గ‌న్ చిన్న‌పిల్లాడిలా గెంతులేయ‌డం చూశాన‌ని రఘు గుర్తు చేస్తూ.. త‌న మిత్రుడి ఫ‌స్ట్ సినిమా జ‌ర్నీ గురించి చెప్పుకొచ్చాడు ర‌ఘు.