పీవీకి సత్య నాదెళ్లకు సంబంధం ఏంటి?

దేశం గర్వించదగ్గ ప్రధాన మంత్రుల్లో పీవీ నరసింహారావు ఒకరు. పైగా మన తెలుగు బిడ్డ. హైదరాబాదులో ఇంకా ఐటీ బూమ్ కూడా రాకముందే 2004లో చనిపోయారు. ఇక సత్య నాదెళ్ల ఇటీవలే వెలుగులోకి వచ్చారు. మన తెలుగువాడే అయినా ఎపుడో విదేశాలకు వెళ్లిపోయారు. అసలు వీరిద్దరు కలిసే అవకాశం ఏ కోశానా లేదే అనుకుంటున్నారా… బహుశా మనం ప్రస్తావించుకునే సంఘటన సత్యనాదెళ్లకు కూడా గుర్తుండుకపోవచ్చు. అలాంటి సంఘటన ఇది.

వేణుగోపాల్ అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉన్నారు. ఆయన కూతురు అనుపమను సత్యనాదెళ్ల పెళ్లాడారు. వేణుగోపాల్ 1967లో రాజమండ్రి సబ్ కలెక్టరుగా ఉండేవారు. అప్పట్లో పీవీ మంత్రిగా పనిచేసేవారు. పుష్కరాల ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన పీవీకి వేణుగోపాల్ పనితీరు నచ్చి గుర్తుపెట్టుకున్నారు. ఆయన కూడా పీవీ గారిని ఎంతో ఇష్టపడ్డారు. అనుకోకుండా పీవీ సొంత జిల్లా వరంగల్ కు కలెక్టరయ్యారు వేణుగోపాల్. అపుడు కరీంనగర్ జిల్లా వంగరలో పీవీ నివాసం ఉండేది. ఆ క్రమంలో పీవీకి మరింత దగ్గరయ్యారు. 1970-71 మధ్య అక్కడ పనిచేశారు. 71లో పీవీ ముఖ్యమంత్రి అయ్యాక వేణుగోపాల్ ను సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టరుగా స్వయంగా ఎంచుకున్నారట. పేదల జీవితాలకు చాలా దగ్గరగా ఉండే శాఖ అది. అందుకే పనితీరులో తనకు ఇష్టుడైన వేణుగోపాల్ ను దాని డైరెక్టరుగా నియమించి పలు సంస్కరణలు తెచ్చారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యాక కూడా వేణుగోపాల్ ను తన వెంట తీసుకెళ్లారు.

వేణుగోపాల్ తన కూతురు అనుపమకు సత్య నాదెళ్లతో వివాహం నిశ్చయించారు. 1992లో వారి నిశ్చితార్థం, పెళ్లి జరిగాయి. పెద్దలను పెళ్లికి పిలుద్దాం అని బంధువులను, క్లోజ్ సర్కిల్ ని నిశ్చితార్థానికి ఆహ్వానించారట ఐఏఎస్ వేణుగోపాల్. అప్పట్లో పీవీ పేషీలోనే పనిచేస్తుండటంతో ఢిల్లీలోనే ఉండేవారు. శుభకార్యం కూడా ఢిల్లీలోనే జరిగింది. అయితే, ఈ నిశ్చితార్థానికి అనుకోని అతిథిగా వచ్చారు పీవీ నరసింహారావు. వేణుగోపాల్ కు ఫీజులెగిరిపోయాయి. ఎందుకంటే పీవీ గారికి ఆహ్వానం పంపలేదు. తనకు ప్రియమైన అధికారి ఇంట శుభకార్యం కదా అని వీలుచేసుకుని పీవీ హాజరయ్యారట. ఒక ప్రధాని అయి ఉండి పిలవకపోయినా నా కూతురు నిశ్చితార్థానికి హాజరై ఆశీర్వదించడం ఆయన నిలువెత్తు నిరాడంబరతకు, అధికార వర్గాలకు ఆయన ఇచ్చే మర్యాదకు మచ్చు తునక అని వేణుగోపాల్ జ్జాపకాలు నెమరేసుకున్నారు. తర్వాత పెళ్లికి ఎలాగూ హాజరయ్యారు. అది వేరే విషయం. అప్పటికి సత్య నాదెళ్ల తండ్రి యుగంధర్ కూడా ఐఏఎస్ అధికారే. అలా సత్య నాదెళ్లను పీవీ నరసింహారావు గారు రెండు సార్లు ఆశీర్వదించారు.

సత్య నాదెళ్లకు ఈ విషయం గుర్తుండొచ్చు. కానీ కీలక బాధ్యతల్లో ఉన్న ఆయనకు ఈరోజు పీవీ శతజయంతి ఉత్సవం అని తెలిసి ఉండే అవకాశం తక్కువ. బహుశా అందుకే ఆయన గురించి ట్వీట్ చేసి ఉండకపోవచ్చు. తన పెళ్లికి వచ్చిన ప్రధాని గురించి ఆయన మరిచిపోయే అవకాశం తక్కువ.