ఈసీ మీటింగ్‌తో మోడీకి ఇబ్బంది తప్ప‌దా?

ఈసీ మీటింగ్‌తో మోడీకి ఇబ్బంది తప్ప‌దా?

రాజకీయాల ప‌ట్ల ఆస‌క్తి ఉన్న ప్ర‌తి ఒక్క‌రి చూపు...ఢిల్లీ వైపే ప‌డింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌తో మాత్ర‌మే కాదు...అంత‌కంటే కీల‌క‌మైన స‌మావేశం వ‌ల్ల. ఓ వైపు లోక్‌సభ, రానున్న అసెంబ్లీ ఎన్నికల మొద‌లైన నేప‌థ్యంలో కొన‌సాగుతుండ‌గానే...ఓటర్ల జాబితాతోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ఎన్నికల సంఘం నేడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానాలను పంపింది.

ఈ సమావేశంలో ప్రధానంగా ఓటర్ల జాబితా, రాజకీయ పార్టీల్లో లింగ ప్రాతినిధ్యం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమైన అంశాలపై పార్టీల అభిప్రాయాలను తెలుసుకుని ఎన్నికల ప్రక్రియను మరింత మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని ఈసీ ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా కచ్చితత్వం, పారదర్శకత మెరుగుదలకు పార్టీల అభిప్రాయాలు తీసుకోనున్నట్టు తెలిపింది. దీంతోపాటు మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు రాజకీయ పార్టీల అంతర్గత నిర్మాణంలో తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపైనా సూచనలను కూడా తీసుకోనున్నట్టు పేర్కొన్నది.

పైకి సాధార‌ణ మీటింగ్ వ‌లే క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ...అనేక హాట్ హాట్ చ‌ర్చ‌ల‌కు వేదిక అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఏడు జాతీయ పార్టీలను, 51 ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించిన‌ ఎన్నికల కమిషన్ ఈ స‌మావేశం అజెండాలో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న జమిలి ఎన్నికలను, ఈవీఎంల అంశాన్ని ఈసీ పేర్కొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. అజెండాలో లేకపోయిన వీటిని ప్రస్తావించి తీరుతామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ' దేశీయంగా వలసవెళ్లే వారు. వివిధ కారణాలతో ఓటింగ్‌కు దూరమయ్యే వారు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలు' అని ఈసీ అజెండాలో పేర్కొన్న అంశంపై కూడా విప‌క్షాలు ప‌ట్టుబ‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం.

నరేంద్రమోడీ ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం ముందుకు తీసుకువచ్చిన జమిలి ఎన్నికలను అత్యధిక రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈవీఎంల విధానాన్ని ఎన్‌డీఎ భాగస్వామ్య పార్టీ శివసేనతో పాటు మరో 16 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దాదాపుగా ఈ అన్ని పార్టీలు సోమవారం జరగనున్న సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం.

మ‌రోవైపు ఎలక్ట్రోరల్‌ బాండ్ల రూపంలో హద్దు,పద్దూ లేకుండా రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వగా, ఎన్నికల కమిషన్‌ తాజా సమావేశంలో ఎన్నికల సమయంలో పార్టీల ఖర్చుకు పరిమితి విధించాలన్న ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. ఇప్పటి వరకు అభ్యర్థి చేసే ఖర్చుకు మాత్రమే పరిమితి ఉన్న సంగతి తెలిసిందే. పార్టీలు నిర్వహించే సభలను, మీడియాకు ఇచ్చే ప్రకటనలను ఈ ఖర్చులో కలపడం లేదు. ఇది దుర్వినియోగమవతోందని ఇసి భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీల ఖర్చుకూ పరిమితి విధించాలని భావిస్తోంది. అయితే, ఎలక్ట్రోరల్‌ బాండ్ల రూపంలో విరాళాలు సేకరించడాన్నే పలు పార్టీలు తప్పు పడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌మావేశం హాట్‌హాట్‌గా సాగ‌నుంద‌ని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు