ముత్యాల పాప.. పాలిటిక్స్ క్లోజేనా..?

ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో మంచి పేరున్న సీనియ‌ర్ నాయ‌కురాలు.. మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాప ప‌రిస్థితి ఏంటి? రాజ‌కీయంగా ఆమెకు ఫ్యూచ‌ర్ ఉన్న‌ట్టా? లేన‌ట్టా? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ త‌ర‌ఫున 2009లో విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్న ద‌రిమిలా.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యం వ‌ర‌కు కూడా ఆమె కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డి మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడితో ఢీ అంటే ఢీ అనేలా రాజ‌కీయాలు న‌డిపారు.

అయితే.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌… కాంగ్రెస్ డోలాయ‌మానంలో ప‌డిపోవ‌డంతో.. ముత్యాల పాప రాజ‌కీయం అనూహ్యంగా మ‌లుపులు తిరిగింది. అప్ప‌ట్లో అంటే.. 2014 ఎన్నిక‌ల‌కు ముందు .. వైఎస్ జ‌గ‌న్ నేతృత్వం లోని.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చేస్తుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఆ పార్టీలోకి చేరేందుకు ముత్యాల పాప ప్ర‌య‌త్నించారు. సామాజిక వ‌ర్గం ప‌రంగా మంచి బ‌లంగా ఉన్న పాప‌కు… వైసీపీ నుంచి ఆహ్వానం కూడా అందింది. అయితే.. ఈ క్ర‌మంలో.. వైసీపీ అధినేత జ‌గ‌న్ నుంచి టికెట్ విష‌యంలో స్ప‌ష్ట‌మైన హామీ ల‌భించ‌క పోవ‌డం.. క‌నీసం జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వి విష‌యంలోనూ హామీ లేక పోవ‌డంతో.. కొన్నాళ్లు పాప ఇబ్బంది ప‌డ్డారు.

ఇదిలావుండ‌గానే.. 2014 ఎన్నిక‌లు ముగిసిపోవ‌డం.. టీడీపీ అధికారంలోకి వ‌చ్చేయ‌డం జ‌రిగాయి. అనంత ర కాలంలో న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం నుంచి అయ్య‌న్న విజ‌యంద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత‌.. పాప మ‌ళ్లీ తెర‌మ‌రుగ‌య్యారు. ఇక‌, మ‌ళ్లీ 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ దూకుడుకు అడ్డుక‌ట్ట వేయాల‌నే ఉద్దేశంతో పాత కాపుల‌ను మ‌ళ్లీ తెర‌మీదికి తెచ్చేందుకు టీడీపీ అడుగులు వేసింది. ఈ క్ర‌మంలోనే ముత్యాల పాప ఇంటికి వెళ్లి మ‌రీ.. అయ్య‌న్న ఆమెను ఆహ్వానించి.. పార్టీ కండువా క‌ప్పించారు.

అయితే.. అప్పుడు కూడా పాప కోరిక నెర‌వేర‌లేదు. న‌ర్సీప‌ట్నం టికెట్ మ‌ళ్లీ.. అయ్య‌న్న‌కే ద‌క్కింది. అయితే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో పాప‌ను ప్ర‌చారానికి బాగానే వాడుకున్నార‌ని అంటారు.. ఆమె అనుచ‌రులు. ఇక‌, పార్టీ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ముత్యాల పాప‌ను ప‌ట్టించుకున్న నాథుడు క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సో.. దీనిని బ‌ట్టి.. అటు వైసీపీకి దూర‌మైన‌.. ముత్యాల పాప‌.. ఇటు టీడీపీకి చేరువైనా.. స‌మీప దూరంలో ఎక్క‌డా ఆశాజ‌నక‌ భ‌విష్య‌త్తు క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంటే.. దాదాపు రాజ‌కీయంగా ఆమె ఫ్యూచ‌ర్ కోల్పోయిన‌ట్టే అంటున్నారు ప‌రిశీల‌కులు.