ఇలా టాలీవుడ్లో ఎందుకు చేయరు?

కోలీవుడ్డో ఈ మధ్యనే ‘నవరస’ అనే ఆంథాలజీ ఫిలిం చ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందుల్లో పడ్డ సినీ కార్మికులకు ఆదుకోవడం కోసం లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఆధ్వర్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆయన ఓ పిలుపునివ్వగానే ప్రియదర్శన్, గౌతమ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్ లాంటి మేటి ఫిిలిం మేకర్స్.. సూర్య, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, రేవతి, అరవింద్ స్వామి, సిద్దార్థ్ లాంటి ప్రముఖ ఆర్టిస్టులు.. రెహమాన్, సంతోష్ శివన్ లాంటి టాప్ టెక్నీషియన్లు ముందుకు వచ్చారు. అంతా కలిసి పారితోషకాల పట్టింపు లేకుండా ఈ ఫిలిం చేశారు. అదెంత బాగా ఉంది, ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అన్నది పక్కన పెడితే ఒక కాజ్ కోసం ఇంత మంది కలవడం గొప్ప విషయం.

ఒక కాజ్ కోసం అనే కాదు.. దర్శకులు ఒక స్థాయిని అందుకున్నాక అప్‌కమింగ్ డైరెక్టర్లను ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మించే సంస్కృతి కోలీవుడ్లో ముందు నుంచి ఉంది. మణిరత్నం, శంకర్, గౌతమ్ మీనన్.. ఇలా చాలామంది టాప్ డైరెక్టర్లు ప్రొడక్షన్ హౌస్‌లు పెట్టి యువ దర్శకులతో ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించిన వారే. తాజాగా మణిరత్నం, శంకర్, గౌతమ్ మీనన్ లాంటి టాప్ డైరెక్టర్లు కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టడం.. అందులో తొలి చిత్రాన్ని ‘మాస్టర్’ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేయబోతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశం అయింది.

ఈ దర్శకులందరూ విడివిడిగా సినిమాలను నిర్మించిన వారే కానీ.. ఇలా అందరూ కలిసి ఒక బేనర్ పెట్టడం.. యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడం విశేషమే. తొలి సినిమా కాబట్టి లోకేష్‌కు ఛాన్సిచ్చారు కానీ.. మున్ముందు ఎక్కువగా కొత్త దర్శకులకే అవకాశాలు ఇవ్వాలన్న ప్రణాళికలతో ఉన్నారట. ఐతే దీని గురించి వార్తలు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు జరగవా అన్న సందేహం కలుగుతోంది.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో సుకుమార్ ఒక్కడే తన అసిస్టెంట్లను ప్రోత్సహించడానికి బేనర్ పెట్టి సినిమాలు తీస్తున్నాడు. మిగతా దర్శకులు తాము తీసే చిత్రాల్లో నిర్మాణ భాగస్వామ్యం తీసుకోవడమో, లాభాల్లో వాటా తీసుకోవడమో చేస్తున్నారు కానీ.. బేనర్ పెట్టి యంగ్ డైరెక్టర్లను ప్రోత్సహించడం చేస్తున్న వాళ్లు అరుదే. ఇక కోలీవుడ్లో మాదిరి అగ్ర దర్శకులు టీంగా ఏర్పడి సినిమాలు చేయడం అనే ఆలోచన ఊహకు కూడా అందనిదే.