ఇందిరా నిర్ణ‌యం వెన‌క రేవంత్ రెడ్డి?

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు మామూలుగా లేదు. ఓ వైపు అధికార ప్ర‌భుత్వ వైఫ‌ల్యం ఆ పార్టీ నేత‌లపై నిప్పులు చెరుగుతున్న ఆయ‌న‌.. మ‌రోవైపు సొంత పార్టీలోని సీనియ‌ర్ల వైఖ‌రిని మార్చే దిశ‌గా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూనే ఉన్నారు.

రాష్ట్రంలో వాత‌మొచ్చిన చేతికి ఊతం అందించి కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావాల‌నే లక్ష్యాన్ని చేరుకునేందుకు అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ‌కీయ వ్యూహాల‌తో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌తో పాటు అధికార టీఆర్ఎస్‌ను బెంబేలెత్తిస్తున్నారు. తాజాగా ష‌ర్మిల పార్టీకి ఇందిరా శోభ‌న్ గుడ్‌బై చెప్ప‌డం వెన‌క రేవంత్ హ‌స్తం ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

రాజ‌కీయాల్లో త‌మ పార్టీని ముందుకు తీసుకెళ్ల‌డంతో పాటు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను దెబ్బ‌కొట్ట‌డం చాలా సాధార‌ణ‌మైన విష‌య‌మే. అందు కోసం నాయ‌కులు ఎన్నో వ్యూహాలు ప‌న్నుతుంటారు. తాజాగా రేవంత్ రెడ్డి కూడా వైఎస్ ష‌ర్మిల పార్టీ విష‌యంలో ఇదే వ్యూహాన్ని అవ‌లంబిస్తున్నాడ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ‌లో అధికారం చేప‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్న రేవంత్‌.. త‌మ పార్టీ ఓట్ల‌ను చీల్చే అవ‌కాశం ఉన్న ష‌ర్మిల పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీపై ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండే రెడ్డి, ద‌ళిత క్రైస్త‌వుల‌ను ష‌ర్మిల త‌న‌వైపున‌కు తిప్పుకునే అవ‌కాశం ఉంది. ఆమె పార్టీ బ‌ల‌ప‌డితే అది కాంగ్రెస్‌పైనే ఎక్క‌వ ప్ర‌భావాన్ని చూప‌నుంది. ఇప్పుడిదే విష‌యాన్ని గ్ర‌హించిన రేవంత్ రెడ్డి ష‌ర్మిల పార్టీని మొద‌ట్లోనే దెబ్బ కొట్టే ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఇటీవ‌ల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఇందిరా శోభ‌న్ తిరిగి కాంగ్రెస్‌లో చేర‌నున్నార‌ని స‌మాచారం. మొద‌టి నుంచి ష‌ర్మిల వెంట ఉండి ఆ పార్టీలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఉన్న‌పాటుగా బ‌య‌ట‌కు రావ‌డం ఆశ్య‌ర్యాన్ని క‌లిగించింది. ఆమె నిర్ణ‌యాన్ని మార్చుకోవాల‌ని పార్టీలో త‌గిన ప్రాధాన్య‌త‌నిస్తామ‌ని ష‌ర్మిల ఫోన్ చేసి హామీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఇందిరా త‌న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉంది.

ఇప్పుడు ఆమె పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం వెన‌క రేవంత్ వ్యూహం ఉంద‌నే చ‌ర్చ సాగుతోంది. రేవంత్కు న‌మ్మ‌క‌స్తురాలైన ఎమ్మెల్యే సీత‌క్క మాట్లాడ‌డం వ‌ల్లే ఇందిరా.. ష‌ర్మిల పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇందిరాకు తగిన ప్రాధాన్య‌త ఇస్తామ‌ని సీత‌క్క‌తో రేవంత్ రెడ్డి చెప్పించార‌నే అభిప్రాయాలు వెల్ల‌డ‌వుతున్నాయి.

ఇప్ప‌టికే ష‌ర్మిల పార్టీలోకి వ‌ల‌స‌లు లేవు. ఇత‌ర నాయ‌కులు ఆ పార్టీలో చేర‌డానికి పెద్ద‌గా సంసిద్ధంగా లేరు. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీలో ఉన్న కీల‌క నేత‌ల్లో ఒక‌రైన ఇందిరాను తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవాల‌నే ప్ర‌ణాళిక ద్వారా ష‌ర్మిల‌ను రేవంత్ గ‌ట్టిదెబ్బ కొట్టార‌నే ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు ష‌ర్మిల ఎక్కువ‌గా దృష్టి పెట్టిన ఖ‌మ్మం జిల్లాపై కూడా రేవంత్ ప్ర‌త్యేక ధ్యాస పెట్టిన‌ట్లు స‌మాచారం.