చిరుకు భారం.. ఆయనకు వరం

మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో సినిమా పక్కా అని తేలిపోయింది. ఈ రోజే దీని గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆదివారం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ విశేషాన్ని పంచుకోబోతున్నారు. ఈ మేరకు దీని నిర్మాత అనిల్ సుంకర శనివారం అప్‌డేట్ కూడా ఇచ్చారు. ఐతే కంత్రి, శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు ఇచ్చిన మెహర్ రమేష్‌తో చిరంజీవి సినిమా చేయడం పట్ల ముందు నుంచి మెగా అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

అసలు మెహర్ దర్శకత్వంలో చిరు సినిమా అని తొలిసారి సంకేతాలు వచ్చినపుడే వాళ్లకు దిమ్మతిరిగిపోయింది. మెహర్ చివరి సినిమా ‘షాడో’ రిలీజై ఎనిమిదేళ్లు దాటింది. ఇన్నేళ్లలో చిన్న స్థాయి హీరోలు కూడా మెహర్‌తో పని చేయడానికి ముందుకు రాలేదు. అలాంటిది ఏకంగా చిరంజీవి లాంటి హీరో మెహర్‌కు అవకాశం ఇవ్వడం ఏంటనేది మెగా అభిమానుల ప్రశ్న.

అసలే మెహర్ రమేష్.. పైగా రొటీన్ మాస్ మసాలా మూవీ అయిన ‘వేదాలం’ రీమేక్ అనేసరికి ఆసక్తి ఇంకా సన్నగిల్లి పోయింది. ఐతే చిరు ఏమీ ఆలోచించకుండా ఈ సినిమా ఓకే చేసి ఉండరని.. కరోనా టైంలో తన పేరిట జరిగిన సేవా కార్యక్రమాలన్నింటినీ మెహర్‌ దగ్గరుండి చూసుకోవడంతో పాటు తన దగ్గరి బంధువు అయిన అతను అవకాశాల్లేక ఇబ్బంది పడుతుండటం చూసి చిరు అవకాశం ఇచ్చి ఉంటాడని, రీమేక్ కాబట్టే ఆయన ధైర్యం చేశారని అంటున్నారు.

ఐతే వరుసగా సొంత బేనర్లోనే సినిమాలు చేస్తున్న చిరు.. ఈ చిత్రాన్ని తాను నిర్మించడం రిస్క్ అనుకున్నారో ఏమో బయటి నిర్మాతకు ఇచ్చేశారు. ఐతే చిరుకు భారంగా అనిపించొచ్చు కానీ.. అనిల్ సుంకరకు మాత్రం ఇది వరమే. ఎలాంటి సినిమా, దర్శకుడెవరు అన్నది పక్కన పెడితే మెగాస్టార్‌తో సినిమా అనేది ఒక అపురూపమైన అవకాశమే. అది అందరికీ దక్కదు. చిరు సినిమా అంటే జరిగే బిజినెస్సే వేరు. లాభాలకు ఢోకా ఉండదు. కాబట్టి ఆయన సంతోషంగా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు.