కామెడీ మూవీ.. చివరికి ఓటీటీలోనే

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున:ప్రారంభం అయ్యాయి. జోరుగా సినిమాలు రిలీజవుతున్నాయి. వారానికి అరడజను సినిమాల దాకా థియేటర్లలోకి దిగుతుండటం విశేషం. అదే సమయంలో ఓటీటీ విడుదలకు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. దృశ్యం-2, టక్ జగదీష్, మ్యాస్ట్రో, విరాటపర్వం లాంటి చిత్రాలు ఓటీటీ డీల్స్ పూర్తి చేసుకున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

వీటితో పాటే ‘వివాహ భోజనంబు’ అనే కామెడీ సినిమాకు కూడా ఓటీటీ డీల్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఉత్తరాదిన బాగా పాపులర్ అయిన సోనీ లివ్’ ఓటీటీలో సౌత్ మీద ఫోకస్ పెడుతూ తెలుగులో మొదటగా రిలీజ్ చేయబోతున్న చిత్రమిదే. దీని గురించి గత నెలలోనే ప్రకటన వచ్చింది. కాకపోతే మధ్యలో నిర్మాత సందీప్ కిషన్ ఆలోచన మారిందని.. ఈ చిత్రాన్ని ముందు థియేటర్లలో రిలీజ్ చేసి తర్వాత ఓటీటీకి ఇచ్చేలా డీల్ మారుస్తున్నాడని ప్రచారం జరిగింది.

ఐతే సందీప్ నిజంగా ఈ ఆలోచన చేశాడో లేదో కానీ.. ‘వివాహ భోజనంబు’ మాత్రం థియేటర్లలోకి రావట్లేదు. నేరుగా ‘సోనీ లివ్’లోనే రిలీజ్ కాబోతోంది. ఈ నెల 27న ‘వివాహ భోజనంబు’కు ప్రిమియర్ డేట్ ఫిక్సయింది. ఆ రోజు శ్రీదేవి సోడా సెంటర్, ఇచట వాహనములు నిలుపరాదు లాంటి ఆసక్తికర చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అదే రోజు ‘వివాహ భోజనంబు’ను ఓటీటీలోకి వదులుతున్నారు. మరి ఈ చిత్రం ఏ మేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందో చూడాలి.

కరోనా టైంలో ఒక మధ్య తరగతి కుర్రాడి ఇంటికి పెద్ద ఎత్తున బంధుగణం వచ్చి పడి లాక్ డౌన్ కారణంగా అంతా అక్కడే ఉండిపోతే అతనెలా ఇబ్బంది పడ్డాడనే కథాంశంతో తెరకెక్కిన ఫన్నీ మూవీ ఇది. సత్య ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని రామ్ అబ్బరాజు అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాత సందీప్ కిషన్ చిన్న కాంపిటీషన్ ఏదో పెట్టి వెయ్యి మందికి ఈ కొత్త ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా అందజేస్తుండటం విశేషం.