ఏపీ బీజేపీలో ఎవరి దారెటు?

ఏపీ బీజేపీలో ఎవరి దారెటు?

ఎన్నికల ముందు ఏపీ బీజేపీలో నేతల మధ్య యుద్ధాలు ఆ పార్టీని కలవరపరుస్తున్నాయి. నేతలు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో పార్టీ కార్యక్రమాలు దిశానిర్దేశం లేకుండా సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించడం ఎలా అన్నది సమస్యగా మారుతోందని సీనియర్ నేతలు అంటున్నారు. ప్రధానంగా గ్రూపు రాజకీయాలు మితిమీరడంతో జనంలో ఆదరణ పెంచుకోలేకపోతున్నాు.

ఏపీ బీజేపీలో గ్రూపు రాజకీయాలు కొత్తేమీ కాకపోయినా ఇప్పుడు మరింత ఎక్కువైపోయాయి. అంతకుముందు కాపు సామాజిక వర్గ నేతుల, కమ్మ సామాజిక వర్గ నేతల మధ్య విభజన కనిపించేది. చంద్రబాబుకు అనుకూలంగా ఉండే కంభంపాటి హరిబాబు వర్గం.. చంద్రబాబును వ్యతిరేకించే సోము వీర్రాజు వర్గం ప్రధానంగా ఉండేవి. కామినేని శ్రీనివాస్ వంటివారు చంద్రబాబుతో ర్యాపో మెంటైన్ చేస్తూ సొంతంగా తన పనులు తాను చక్కబెట్టుకుంటుండేవారు. అయితే... కన్నా లక్ష్మీనారాయణను పార్టీ అధ్యక్షుడిని చేసిన తరువాత నుంచి పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. కన్నా ఎంపికను సోము వీర్రాజు వర్గం బహిరంగంగా వ్యతిరేకించింది. కన్నా నియామకానికి కొద్దిరోజుల ముందే సోము వీర్రాజు రాయలసీమ అంతా పర్యటించగా ఇప్పుడు కన్నా మళ్లీ అదే ప్రాంతంలో పర్యటిస్తున్నారు. సీమకు చెందిన ముఖ్య నేతలు కొందరు కన్నా సమావేశాలకు రాకపోవడం చర్చనీయమవుతోంది.

అలాగే... ఇటీవల వీర్రాజు రాజమండ్రిలో  పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తే స్థానిక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు తెలియదని ఆయన అనుచరులు చెబుతున్నారు. వీరాజ్రుకు మాజీ మంత్రి మాణిక్యాలరావు అనుకూలంగా ఉంటున్నా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడంలేదు. మంత్రిగా అన్ని ప్రాంతాలకు సుపరిచితుడైన మాణిక్యాలరావు ఇలా ఉండటం వెనుక పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక హరిబాబయితే పార్టీ అధ్యక్ష పదవి కూడా లేకపోవడంతో ఆయన విశాఖపట్నానికే పరిమితమయ్యారు. ఏళ్ల తరబడి బీజేపీలో వెంకయ్యతో సమానంగా పనిచేసిన ఆయన పార్టీ కార్యాలయానికి కూడా రావడంలేదు. హరిబాబు స్పీడు తగ్గించడంతో విశాఖలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌ ఎవరిదారి వారిదే అన్నట్లు ఉంటున్నారు.

ఇక విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాస్  వంటివారి తీరు వివాదాస్పదమవుతోంది. విష్ణుకుమార్‌రాజు సీఎం పనితీరును ఇటీవల బహిరంగంగా ప్రశం సిస్తుంటే.. మరో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తాను బీజేపీలోనే ఉంటానని చెబుతూ.. ఇటీవల సీఎం చంద్రబాబుతో కలిసి గుంటూరులో ఒక కార్యక్రమంలో పాల్గొనడం పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నా కావూరి సాంబశివరావు జాడే కనిపించడం లేదు.  కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ప్రకటనలు మీద ప్రకటనలు గుప్పిస్తున్నా పార్టీ కార్యాలయానికి మాత్రంరావడం లేదు. గోకరాజు గంగరాజు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి.

ప్రస్తుతం ఏపీ బీజేపీ నుంచి ఏమైన గొంతు వినిపిస్తుందంటే అది ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడైన జీవీఎల్‌ నర్సింహరావు ఒక్కరిదే వినిపిస్తోంది. అడపాదడపా బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్దన్‌ రెడ్డి కూడా గొంతెత్తుతున్నారు. మిగతా నేతలు మాత్రం తమకేమీ పట్టనట్లుగా సాగిపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు