ట్విట్టర్ స్పేస్‌లు పెడుతున్న చిచ్చు

ఇండయాలో ఫ్యాన్ వార్స్ పేరెత్తితే కోలీవుడ్, టాలీవుడ్డే గుర్తుకొస్తాయి అందరికీ. ఇక్కడ ఒక హీరో మీద ఇంకో హీరో అభిమానులకు ఉండే ద్వేషం అంతా ఇంతా కాదు. తమ హీరో గొప్ప అని చెప్పుకోవడం కంటే అవతలి హీరో వేస్ట్ అని చెప్పడానికే అభిమానులు ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు.

ఒకప్పుడు ఒక హీరో మీద ద్వేషంతో ఇంకో హీరో అభిమానులు రకరకాల ఆరోపణలు చేస్తూ పాంప్లెట్లు వేసి పంచే సంస్కృతి ఉండేది టాలీవుడ్లో. తర్వాత ఈ ద్వేషం రకరకాల మార్గాల్లో చూపిస్తూ వచ్చారు. సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి విష ప్రచారాలు మరో స్థాయికి చేరాయి.

అవతలి హీరో గురించి ఏ చిన్న ప్రతికూల విషయం కనిపించినా దాన్ని బూతద్దంలో పెట్టి.. వలువలు చిలువలు చేసి దుష్ప్రచారాలు చేయడం బాగా ఎక్కువైపోయింది సోషల్ మీడియాలో. తమిళంలో విజయ్-అజిత్ అభిమానులు పరస్పరం అద్వాన్నమైన రీతిలో దుష్ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్లకు ఎంతసేపే అవతలి హీరోను డీగ్రేడ్ చేయడమే పని.

ఈ ఒరవడిని తెలుగు అభిమానులు కూడా బాగానే అందిపుచ్చుకున్నారు. చివరికిది ఎలా తయారైందంటే.. ఒక ఫ్యామిలీకి చెందిన హీరోల్లోనే వర్గాలు మొదలై పరస్పరం దారుణంగా కించపరుచుకునే పరిస్థితి తయారైంది. ముఖ్యంగా ఈ మధ్య ట్విట్టర్లో స్పేస్ అనే కొత్త ఫీచర్ రాగా.. అవి అభిమానుల కుమ్ములాటలకే వేదికలు అవుతున్నాయి.

మిగతా భాషల వాళ్లు మంచి మంచి టాపిక్స్ పెట్టుకుని విజ్ఞానం పెంచుకునేందుకు స్పేస్‌లను వాడుతుంటే.. తెలుగు వాళ్లలో మాత్రం ఎక్కువగా సినిమా టాపిక్‌ల మీదే స్పేస్‌లు పెడుతున్నారు. అందులోనూ ఇక్కడ దురభిమానులే ఎక్కువగా ఉంటున్నారు. హీరోల వ్యక్తిగత విషయాల మీద స్పేస్‌లు పెట్టి దారుణమైన కామెంట్లతో స్పేస్‌లను భ్రష్టుపట్టిస్తున్నారు.

తాజాగా ఒక హీరోకు పెళ్లయి చాలా ఏళ్లయినా ఇంకా పిల్లలు పుట్టకపోవడం గురించి స్పేస్ పెట్టడం గమనార్హం. అందులోని కామెంట్లు వింటే ఆ హీరోను నటుడిగా వ్యతిరేకించేవాళ్లు కూడా ఆమోదయోగ్యంగా అనిపించదు. ఇలాంటి వరస్ట్ కాన్సెప్ట్‌లతో స్పేస్‌లు పెట్టి తెలుగు వాళ్ల పరువు తీసేస్తున్నారు మన నెటిజన్లు. ట్విట్టర్ స్పేస్‌లు రోజు రోజుకూ శ్రుతి మించుతున్న ఇలాంటి వ్యవహారాలు చూస్తుంటే ఈ ఫీచర్ ఎందుకొచ్చిందా అన్న అభిప్రాయం కలుగుతోంది.